
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
జనగామ రూరల్: బొమ్మకూర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీరు అందించి ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కారు. మంగళవారం జనగామ హుస్నాబాద్ రోడ్డు వడ్లకొండ రహదారి వద్ద ఎండిన వరి కొయ్యలు, ప్లకార్డ్స్‌తో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అధికా రులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాల్వల ద్వారా వేల ఎకరాలు వరి సాగు అవుతుండగా అధికారులు సకాలంలో చెరువులను నింపకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నామన్నారు. వరినాట్లు వేసే సమయానికి కూడా నీరు రాకపోవడంతో వరి సాగు చేయడం లేదన్నారు. బోరు బావులు ఉన్న రైతులు కూడా వరి నారు పోసి 40 రోజులు దాటుతుండటంతో నారు ముదిరిపోయే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వడ్లకొండ గ్రామంలో యేనెచెరువు, ఎర్రకుంటతండా నుంచి వడ్లకొండకు కాల్వల ద్వారా నీరు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎల్లబోయిన హరీష్, కాగితాపురం రామ్ మోహ న్ రెడ్డి, కాసర్ల అశోక్, నామాల రాజు, బొల్లం శార ద, అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయాలని రాస్తారోకో