
దొంగల బీభత్సం
జనగామ: జిల్లా కేంద్రంలో ఒక్కరోజే రెండు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించగా, మరో రెండు గృహాల్లో దొంగతనం చేశారు. రెండు వారాలు తిరగక ముందే మరోసారి దొంగల హల్‌చల్‌తో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ధర్మకంచ అంగన్‌వాడీ టీచర్ ఇంట్లో 12 తులాల బంగారం, వెండి, నగదు, జీఎంఆర్ కాలనీలో ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ రిటైర్డు అధికారి ఇంట్లో చోరీ ఘటన మరువక ముందే వరుస ప్రయత్నాలు పోలీసులకు సవాల్‌గా మా రిపోయింది. ఇటీవల జీఎంఆర్ కాలనీలో దొంగలు తమ ఆనవాళ్లను పోలీసులు పసిగట్టకుండా ఇళ్లంతా కారం చల్లి కొత్త తరహా పద్ధతికి తెరలేపారు. ప్రస్తుత చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని జీఎంఆర్–2 కాలనీలో ఎన్‌పీడీసీఎల్ శాఖలో పని చేస్తున్న కృప ఇంటికి తాళం వేసి ఈ నెల 14న స్వగ్రామానికి వెళ్లింది. మంగళవారం ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి తలుపులు తీసిఉండడంతో ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించింది. ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్‌రెడ్డితో కలిసి డీసీపీ రాజమహేంద్ర నాయక్ అక్కడకు చేరుకుని ఘటనకు సంబంధించి ఆరా తీశారు. రూ.35వేలు, బంగారు ఆభరణాలు (లెక్క తెలియాలి) ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు వివరించారు.
బాలాజీనగర్‌లో వ్యాపారి ఇంట్లో..
బాలాజీనగర్‌కు చెందిన వ్యాపారి ఎం.నర్సింహరాములు 14వ తేదీ రాత్రి కుటుంబంతో సహా తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి దొంగలు బీరువాను తెరిచి బట్టలను చిందర వందర చేశారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఫింగర్ ప్రింట్స్ నిపుణులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమాయ్యరు. అలాగే సమీపంలో ఉన్న రిటైర్డ్ అధికారి వాసుదేవరావు తాళం వేసిన ఉన్న ఇంటి తలుపులను తెరిచేందుకు ప్రయత్నించగా సెంట్రల్ లాకింగ్ సిస్టంతో కనెక్టివిటీ ఉండడంతో వదిలేసి వెళ్లి పోయారు. శ్రీ విల్లాస్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సత్యనారాయణతో పాటు మరో ఇంటి తాళాలు పగులగొట్టారు. వేలిముద్ర నిపుణులు ఆధారాల కోసం అన్వేషిస్తుండగా, క్రైం పోలీసులు దొంగల కోసం వేట సాగిస్తున్నారు. పోలీసు తనిఖీలు ప్రధాన రోడ్లపై మినహా వలస కూలీలతో పాటు శివారు ప్రాంతాలు, పట్టణ నడిబొడ్డున ఉన్న కాలనీల్లో నిఘా లేకుండా పోయిందని పలువురు అంటున్నారు. పోలీసులు ఇకనైనా తనిఖీలు మరింత పెంచాలని కోరుతున్నారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్
భయం భయంగా జనగామ పట్టణ ప్రజలు
రంగంలోకి డీసీపీ, పోలీసులు,
క్లూస్ టీం బృందం