
చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
జనగామ: జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్‌లో మొత్తం దొడ్డు, సన్నరకాలు కలిపి 160 మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణకు ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు 282 ఏర్పాటు చేయగా.. కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో ఇప్ప టి వరకు 139 కేంద్రాలను మూసి వేశారు. ప్రభుత్వం 30,364 మంది రైతుల నుంచి 149.32 మెట్రిక్ టన్నుల దొడ్డు, సన్నరకం ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు రూ.340కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.315 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మరో రూ.25కోట్ల బకాయి ఉంది. ఇందులో 20,174 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.10.04 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు పైసా రాలేదు.
కొనుగోళ్లలో వేగం
రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చివరి దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచారు. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల పరిధిలో సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అకాల వర్షాలతో సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో పాటు వడ్లు తడవకుండా టార్పాలిన్ కవర్ల ను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో 5 నుంచి 10 శాతం ధాన్యం మిగిలి ఉంది. సేకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే మిగతా సెంటర్లను మూసి వేయనున్నారు.
ధాన్యం మిల్లులకు తరలించాలి
జిల్లాలో ధాన్యం కొనుగో ళ్లు చివరి దశకు చేరుకు న్నాయి. రెండు, మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్వాహకులు సెంటర్లలో ఉన్న కొద్ది పాటి ధాన్యం తడసి పోకుండా చర్యలు తీసుకోవాలి. కాంటా వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించాలి. రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్ సప్లయీస్ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను అప్‌లోడ్ చేయాలి.
– షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్
149.32 మెట్రిక్ టన్నులు సేకరణ
282 కేంద్రాలకు
139 సెంటర్ల మూసివేత
143 సెంటర్లలో
5 నుంచి 10 శాతం ధాన్యం
రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి
రైతుల ఖాతాల్లో రూ.315 కోట్లు జమ
ఇంకా చెల్లించాల్సి ఉన్న మొత్తం రూ.25కోట్లు..
బోనస్ బకాయి రూ.10 కోట్ల వరకు..

చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు