
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా చేపట్టాలి
జనగామ రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస పథకం, శానిటేషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఎంపీఓ లు, ఏపీఓలతో శుక్రవారం కలెక్టరెట్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఈనెల 28 లోపు మండల స్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీకి నివేదిక పంపించాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం విధిగా పెంచాలని, మెటీరియల్ పనులు పౌల్ట్రీ, గోట్స్‌షెడ్స్ తదితర వాటికి ఎంపీడీఓలు త్వరగా మంజూరు తీసుకోవా లని పేర్కొన్నారు. నీటి వనరుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ వసంత, డీపీఓ స్వరూప, ఎల్‌డీఎం తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్