
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి
పాలకుర్తి టౌన్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం బమ్మెర గ్రామంలో సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సంబంధించి ప్రక్రియ క్షేత్రస్థాయి ధ్రువీకరణను వేగవంతం చేయాలని, పక్కా సమాచారం సేకరించాలని చెప్పారు. అర్హులను గుర్తించి వివరాలను ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. మండలంలోని ఈరవెన్న, గూడూరు గ్రామాల్లోని ధాన్యం కొనుకొ లు కేంద్రాలను సందర్శించిన ఆయన.. రైతులు ఆయా సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తేమ శాతం, కొగుగోళ్ల రిజిస్టర్‌లను పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నాగేశ్వరాచారి, ఎంపీడీఓ రాములు, ఆర్‌ఐ రాకేశ్ తదితరులు ఉన్నారు.
విత్తనాలు అధిక ధరలకు విక్రయించొద్దు
రైతులకు విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, సుధ ఫర్టిలైజర్ దుకాణాలను సందర్శంచిన ఆయన విత్తన క్రయ విక్రయాల రికార్డులు, కంపెనీల పత్రాలను, విత్తన ప్యాకెట్లపై లేబుల్స్, వ్యాపార లైసెన్స్ తదితరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన తర్వాత విధిగా సంతకంతో కూడిన రశీదు రైతులకు ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా దుఖానాల్లో కొనుగోలు చేసిన పలువురు రైతులకు ఫోన్ చేసి మాట్లాడారు. విత్తనాలు ఎక్కడ కొన్నారు.. ఎంత ధర తీసుకున్నారు.. అదనంగా నగదు ఏమైనా చెల్లించారా అని తెలుసుకున్నారు. మండల వ్యవసాయ అధికారి శరత్‌చంద్ర, తహసీల్దార్ నాగేశ్వరాచారి, ఆర్‌ఐ రాకేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా