
వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు
3.49 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
జనగామ రూరల్: జిల్లాలో యాసంగి పంటలు ముగుస్తున్న క్రమంలో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ చివరలో జిల్లాకు దేవాదుల ద్వారా నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయి చాలామంది రైతులకు నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడులు సైతం రాక ఇబ్బందులు పడ్డారు. ఈ వానాకాలంలోనైనా మంచి దిగుబడి వస్తుందనే ఆశతో ముందుకుసాగుతున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వానాకాలంలో సుమారు 3,49,930 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి 40 నుంచి 50 వేల ఎకరాల్లో అదనంగా సాగయ్యే అవకాశం ఉన్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పండ్ల తోటలు, ఇతర పంటల సాగుకు సంబంధించి ప్రణాళికను సైతం రూపొందించారు. ఈసారి వర్షాలు సైతం ముందుగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో కొంత మంది రైతులు వేసవి దుక్కులు మొదలుపెట్టారు.
సీజన్ ప్రారంభం నాటికి ఎరువులు
రైతులు సాగు చేసే పంటలకు అనుగుణంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు, విత్తనాలు అవసరమవుతాయో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాకు సంబంధించి వివిధ రకాల ఎరువులు 95,691 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. యూరియా 26వేలు అవసరం ఉండగా ప్రస్తుతం 4 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ 5వేల మెట్రిక్ టన్నులకు 790 మెట్రిక్ టన్నులు, పోటాష్ 3,529 మెట్రిక్ టన్నులకు 450, ఎస్‌ఎస్‌పీ 1,783 మెట్రిక్ టన్నులకు 590, కాంప్లెక్స్ ఎరువులు 10 వేల మెట్రిక్ టన్నులకు 2వేల మెట్రిక్ టన్నులతోపాటు ఎరువలు అందుబాటులో ఉన్నా యి. అయితే సీజన్ ప్రారంభం వరకు నెలవారీ కోటా వస్తుందని, ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచుతాం..
వానాకాలం సాగుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే కాకుండా సీజన్ ప్రారంభం వరకు నెలవారీ కోటా తెప్పించి అందుబాటులో ఉంచుతాం. జిల్లాలో ఈసారి 3లక్షల 49 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశాం.
– రామారావు నాయక్, జిల్లా వ్యవసాయాధికారి
ఈ ఏడాది అత్యధికంగా వరి, పత్తికి అవకాశం
అందుబాటులో 25 శాతం విత్తనాలు, ఎరువులు
సీజన్ నాటికి అందించేలా అధికార యంత్రాంగం కసరత్తు
దుక్కులు సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలు
విత్తనాల అంచనా..
ఈసారి జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగవుతుండగా ఇందుకు అనుగుణంగా ముందుగానే అధికారులు అవసరమయ్యే విత్తనా ల అంచనాలు సిద్ధం చేశారు. పత్తి 5లక్షల ప్యాకెట్‌లు, వరి 44,012 క్వింటాళ్లు, రెడ్‌గ్రాం 70 క్వింటాళ్లు, పల్లికాయ 50 క్వింటా ళ్లు, మొక్కజొన్న 367వేల క్వింటాళ్లు, మినుములు 1.5 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని భావిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో పాటు విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ఆన్‌లైన్ పద్ధతి, రశీదుల జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు