
మెరుగైన వైద్యం అందించాలి
జనగామ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి సర్కారు ఆస్పత్రులపై మరింత నమ్మకం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావుతో కలిసి పలు విభాగాలను పరిశీలించారు. జనరల్, ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆస్పత్రిలో వసతులు, అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, అపరిశుభ్రతకు తావులేకుండా శానిటేషన్ పనులను పర్యవేక్షించాల ని చెప్పారు. నూతన సీటీ స్కాన్ సేవలను త్వరగా అందుబాటులోకి తేవాలని, లాప్రోస్కోపీ, డెంటల్ విభాగంలో రూట్ కెనాల్ సేవలను మరింత ఇంప్రూవ్ చేయాలని సూచించారు. పలు వార్డుల్లో ఉన్న ఏసీలు పనికి రాకుండా పోగా.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూడీఐడీ కేటాయింపునకు దివ్యాంగులను వెంట వెంట నే పరీక్షిచి పంపించాలన్నారు. రోగుల సౌకర్యార్థం ఎంసీహెచ్‌లో లిఫ్టు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ చాంబర్‌లో హెచ్‌ఓడీలు, వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలో కొరత ఉన్న వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని, రోగుల కు అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించా రు. అక్కడి నుంచి మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వసంత ఉన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా