
చెట్ల తొలగింపు పనులు షురూ
జనగామ: ఐదు రాష్ట్రాల వారధిపై వృక్షాలుగా మారుతున్న రావి చెట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ‘వారధికి ముప్పు’ శీర్షికన సాక్షిలో ఈ నెల 19న ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించారు. చెట్ల తొలగింపునకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లను ఆదేశించగా.. స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం పనులను ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులు భారీ క్రేన్ల సహాయంతో బ్రిడ్జికి ఇరువైపులా మహా వృక్షాలుగా పెరిగిన రావి చెట్లను తొలగిస్తున్నారు. చెట్లను పూర్తి స్థాయిలో తొలగించాలంటే రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రావి చెట్ల వేర్లు బ్రిడ్జి లోనకు చొచ్చుకుని పోవడంతో కార్మికులకు కష్టతరంగా మారింది. చెట్టు కొన వరకు కటింగ్ చేసి అక్కడికే వదిలేస్తున్నారు. దీంతో కొద్ది రోజుల్లో మొండెం కాస్తా మొలకెత్తే అవకాశం లేకపోలేదు. ఏదేమైన ప్‌లై ఓవర్‌పై చెట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది.
కుంగిన ఫుట్‌పాత్‌కు మరమ్మతు ఎప్పుడు?
బ్రిడ్జిపై కుంగిన ఫుట్‌పాత్, కూలుతున్న రేలింగ్, పెచ్చులూడి పోతున్న స్లాబ్ పరిస్థితి ఏంటనే అనుమానాలను పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ఫుట్‌పాత్‌పై బాటసారులు నడవకుండా ఏర్పాటు చేసిన పూలకుండీలను నేటికి తొలగించలేదు. అదే సమయంలో ఫుట్‌పాత్‌కు సమాంతరంగా రోడ్డు పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడింది. అలాగే బ్రిడ్జి కింద ఎలాంటి వ్యాపారాలు, పనులు, దుకాణాల నిర్వహణ ఉండొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ, పురపాలిక అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అన్ని వ్యాపారాలు అక్కడే జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఎప్పుడూ వందలాది మంది ఉంటారు. జరగరాని ప్రమాదం జరిగితే ఏంటనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నాణ్యత, సామర్థ్యం లెక్కించి రోజువారీగా వాహనాల రవాణా, లోడ్ ఎంత మేర వెళుతుందనే దానిపై దృష్టి సారించాలి. కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించి బ్రిడ్జిపై ఉన్న పూలకుండీలను తొలగించి, కుంగిన ఫుట్‌పాత్‌కు మరమ్మతు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కుంగిన ఫుట్‌పాత్..
కూలుతున్న రేలింగ్ పరిస్థితి ఏంటి?

చెట్ల తొలగింపు పనులు షురూ

చెట్ల తొలగింపు పనులు షురూ