
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న
జనగామ రూరల్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్‌లను తీసుకువచ్చి వాటిని అమలు చేయాలని చూస్తుందన్నారు. జూలై 9వ తేదీన తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో పని చేస్తున్న ఆశవర్కర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఈ కార్యక్రమలో బూడిద ప్రశాంత్, ఆశ వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముదాం రాజమణి, జిల్లా కోశాధికారి పసులాది శోభ, స్వప్న మంజుల, కవిత, అనిత, కల్పన, మమత, మల్లేష్ రాజ్, శివరాత్రి రాజు తదితరులు పాల్గొన్నారు.