చొప్పదండి: రెండు పెళ్లిల్లు జరిగినా విడాకులు కావడంతో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఆర్నకొండలో జరిగింది. ఎస్సై నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆర్నకొండకు చెందిన గంగాధర గంగయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగరాజు (33) కారు డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. 2016లో వివాహం చేయగా కొద్ది రోజులకే భార్యతో విడాకులయ్యాయి. అనంతరం మరో వివాహం జరిపించగా గతేడాది రెండో భార్యతో కూడా విడాకులయ్యాయి. దీంతో మద్యానికి బానిసైన నాగరాజు ఈ నెల 13న స్నేహితులతో మద్యం తాగడానికి వెళ్లగా రాత్రి అతడి తమ్ముడు అనిల్ ఇంటికి తీసుకువచ్చాడు. తిరిగి ఉదయం లేచి చూసేసరికి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పీజీ సీటు రాలేదని వైద్యుడి..
కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లికి చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ గౌతమ్ (39) పీజీలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. గౌతమ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కాంట్రాక్టు పద్ధతిలో ధర్మారం మండలం నందిమేడారం పీహెచ్‌సీలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. నెల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రెండు పర్యాయాలు పీజీ సీటు కోసం ప్రవేశపరీక్ష రాసినా మెరిట్ మార్కులు రాక సీటు లభించలేదు. కొంతకాలంగా మనోవేదనతో ఉన్న గౌతమ్ ఆదివారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
క్వారీలో ప్రమాదంలో ఒకరు మృతి
గంగాధర: మండలంలోని సర్వారెడ్డిపల్లి సమీపంలోని గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో సుదధగోని అంజయ్య(40) మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన అంజయ్య పీఎస్‌ఆర్ గ్రానైట్ క్వారీలో స్టోన్ కటింగ్ మిషన్ హెల్పర్‌గా పని చేస్తున్నారు. సోమవారం వేకువజామున బయటకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బండరాయి జారి తలపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కూలీ పనికి వెళ్తూ అనంత లోకాలకు..
చొప్పదండి: పట్టణంలోని13వ వార్డుకు చెందిన బైర రాజ్‌కుమార్ (32) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ కరీంనగర్‌లో కూలీ పని చేస్తుంటాడు. మంగళవారం ఉదయం తన సోదరి నగునూరు ఆసుపత్రిలో నర్సింగ్ చదువుతున్న బైర నిఖిత, ఆమె స్నేహితురాలు పిట్టల ఉషశ్రీలను బైక్‌పై తీసుకొని ఆసుపత్రిలో దించి పనికి పోవడానికి బయలుదేరాడు. రుక్మాపూర్ శివారులోని చాకుంట ఎక్స్‌రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న పెద్ద ట్రాలీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రాజ్‌కుమార్, నిఖిత, ఉషశ్రీకి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాజ్‌కుమార్ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు.
భార్య గర్భిణి
చొప్పదండిలోని జ్యోతినగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌కు ఏడేళ్ళ క్రితం వివాహం అయింది. ఇప్పటికే ఆరేళ్ల పాప ఉండగా, మృతుడి భార్య కవిత తొమ్మిది నెలల గర్భిణి. రోడ్డు ప్రమాదంలో అన్న మృతిచెంది, చెల్లి గాయాల పాలవడం స్థానికంగా విషాదం నింపింది.
టీ తాగేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
కరీంనగర్‌రూరల్: కొడుకు ఫంక్షన్ కోసం సంతోషంగా ఇంటికి వచ్చిన తండ్రిని ప్రైవేట్ బస్సు బలితీసుకుంది. సౌదీ అరేబియా వెళ్లేందుకు కుటుంబసభ్యులతో సంతోషంగా ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లిన ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబంలో తీరని విషాదం నింపింది. వివరాలు.. కరీంనగర్‌లోని సిటిజన్స్‌కాలనీకి చెందిన మొహియుద్దీన్ కుమారుడు మహ్మద్ అజీమోద్దిన్(26) ఉపాధినిమిత్తం నాలుగేళ్లుగా సౌదీ అరేబియా వెళ్లివస్తున్నాడు. నాలుగునెలలక్రితం అజీమ్ భార్య డెలీవరీ కావడంతో బాబు పుట్టాడనే సమాచారంతో కరీంనగర్‌కు వచ్చేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. 15 రోజులక్రితం కుమారుడికి హఫీఖా ఫంక్షన్ చేసేందుకు సెలవుపై వచ్చాడు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపిన అజీమ్ తిరిగి సౌదీ వెళ్లేందుకు ఈ నెల 14న కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. మార్గమధ్యలో కారు ఆపి కుటుంబసభ్యులకు టీ తీసుకవచ్చేందుకు హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో కంటెయినర్ వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పిన ఓ ప్రైవేట్ బస్సు హోటల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో తీవ్రంగా గాయపడిన అజీమ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లముందే అజీమ్ మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మంగళవారం అంత్యక్రియలను నిర్వహించారు.
నాగరాజు (ఫైల్)


