నాలుగేళ్లు సహజీవనం.. పెళ్లికి నిరాకరణ | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లు సహజీవనం.. పెళ్లికి నిరాకరణ

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

మంచిర్యాలక్రైం: భర్త సరిగా చూసుకోవడం లేదని ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇప్పించిన అతడు నాలుగేళ్లు ఆమెతో సహజీనం చేశాడు. ఆమె గర్భం దాల్చగా.. ఆడపిల్లల అని తెలిసి అబార్షన్‌ చేయించాడు. తీరా పెళ్లికి నిరాకరించడంతో అటు భర్త, కన్నవారికి దూరమై.. ఇద్దరు పిల్లలతో ఎలా జీవించాలో తెలియక ఈనెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళకు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పెల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహ మైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. అతడు విదేశానికి వెళ్లేవాడు. ఇద్దరు మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో బాధిత వివాహిత స్నేహితురాలి స్నేహితుడు మందమర్రికి చెందిన మహేష్‌తో కలిసి మందమర్రి పాలచెట్టు ప్రాంతానికి చెందిన షారుఖ్‌పాష పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో షారుఖ్‌పాషకు బాధిత మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమెతో భర్తకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు.

కలిసి జీవనం

సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కూతుళ్లను చూసుకుంటానని షారుఖ్‌పాష నమ్మించి రామకృష్ణాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని క్యాతనపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలం సహజీవనం చేశారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమెకు అబార్షన్‌ చేయించగా.. మూడోసారి మంచిర్యాల బస్టాండ్‌ సమీపంలోని ఓ స్కానింగ్‌ సెంటర్‌లో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో మళ్లీ అబార్షన్‌ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించి షారుఖ్‌ఖాన్‌పై ఆమె ఒత్తిడి తేగా నిరాకరించాడు. దీంతో ఆ మహిళ దోమలమందు, జ్వరం గోలీలు వేసుకుని ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు షారుఖ్‌పాషపై కేసు నమోదు చేసి రామకృష్ణాపూర్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.

ఆడపిల్ల అని తెలిసి అబార్షన్‌ చేయించిన ప్రియుడు

వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement