జగిత్యాల క్రైం: గల్ఫ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని బాధితులు మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పట్టణంలో గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి ఐదుగురి నుంచి రూ.2.37లక్షలు తీసుకుని మస్కట్ పంపించాడని, అక్కడ పనిలేక వాపస్ వచ్చామని, తమకు నష్టం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడిపై విచారణ
జగిత్యాల: కథలాపూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ.. ఓ ఉపాధ్యాయురాలిని వేధించి సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిని ఫిర్యాదుల కమిటీ ఆధ్వర్యంలో పోష్ యాక్ట్ 2013 ప్రకారం మంగళవారం విచారించారు. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు, ఆధారాలు సమర్పించాలని ఫిర్యాదుల కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అతడిని కమిటీ విచారణ చేపట్టింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు పంపించామని కమిటీ సభ్యులు తెలిపారు.
46.654 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటి మట్టం
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుతోంది. ప్రస్తు తం నీటిమట్టం 1080.60 అడుగులు, నిల్వ సా మర్థ్యం 46.654 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1688 క్యూసెక్కులు చేరుతోంది.
బాలికను వేధించిన యువకుడి రిమాండ్
శంకరపట్నం: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురిచేసిన నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రేకుర్తికి చెందిన నగూర్ రవి బాలికను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి హుజూరాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.


