రూ.2.98 లక్షలతో గృహ నిర్మాణం
ధర్మపురి: భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో కలిసి పూరిగుడిసెలో నివాసముంటున్న పేద మహిళ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐ దంపతులు అండగా నిలిచారు. మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి లక్ష్మి భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసముంటోంది. అమెరికాలో ఉంటున్న జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం సభ్యులు ఎన్‌ఆర్‌ఐ దంపతులు నూనె శివకుమార్, శ్రీదేవీ దంపతులు తమవంతుగా ఓ పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని భావించారు. ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణుకుంట రమేశ్‌ను రెండునెలల క్రితం ఫోన్ ద్వారా సంప్రదించి విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో రమేశ్ లక్ష్మి కుటుంబం గురించి వివరించగా.. సదరు ఎన్‌ఆర్‌ఐ దంపతులు ముందుకొచ్చి రూ.2.98లక్షలతో మూడు గదులతో ఇల్లు నిర్మించారు. ఆదివా రం నూతన గృహ ప్రవేశానికి శివకుమార్ సోదరుడు నూనె వెంకటరాజేంద్రకుమార్ తమ భార్య రజినీతో కలిసి వచ్చారు. సొంత గూడు కల్పించినందుకు లక్ష్మి కుటుంబం ఎన్‌ఆర్‌ఐ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. దాతల సాయంతో ఇప్పటిరవకు 28 మంది పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని రమేశ్ తెలిపాడు. కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి తిరుపతి, జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.


