మెట్‌పల్లి(కోరుట్ల): కొందరు ప్రజాప్రతినిధులు తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మున్సిపల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల నరేశ్ రోజువారీ పరిపాలనలో జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు పెట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఈ నెల 4న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికీ కేసు నమోదు కాలేదు. అయితే ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన కమిషనర్, ఇతర ఉద్యోగులు నిరసన తెలపడం కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న చైర్మన్ లింబాద్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుతో తామంతా ఆత్మవిశ్వాసం కోల్పోయి నైరాశ్యంలో ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలోనే నిరసన తెలపాలని నిర్ణయించామని, చైర్మన్ హామీతో విరమించామని పేర్కొన్నారు.


