జగిత్యాల: డ్రగ్స్ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో చేపడుతున్న యాంటి డ్రగ్స్ 3కే రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తున్న మత్తుపదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా ముందుకురావాలన్నారు. పట్టణ ప్రజలు, యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో యాంటి డ్రగ్స్ 3కే రన్‌లో పాల్గొనాలని కోరా రు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్, ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపల్ అధికారులకు విజిలెన్స్ నోటీసులు
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు ఇప్పటికే దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్యాక్స్ హెచ్చుతగ్గులు, కమర్షియల్ భవనాల పన్నుల నిర్ధారణలో జరిగిన అవకతవకలపై హాజరు కావాలని మున్సిపాలిటీలోని రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు శనివారం కరీంనగర్ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ విషయంలో గతంలో ఓ అధికారి సస్పెండ్ కాగా.. మళ్లీ విజిలెన్స్ అధికారులు బల్దియాపై దృష్టి సారించారు. దీంతో అధికారుల్లో దడ మొదలైంది.
ఆదర్శం ఈ ఉపాధ్యాయురాలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఖాజీపురలోగల ప్రభుత్వ ఉర్దూమీడియం హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సబిహానాజ్ తన కుమార్తె షర్పియనాజ్‌ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. షర్పియానాజ్ ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తన కూతురును చేర్పించినట్లు సబిహానాజ్ తెలిపారు. హెచ్‌ఎం మహ్మద్ హఫీజుద్దీన్, అడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జి మహ్మద్ సమియోద్దీన్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, షాహిస్త ఇర్ఫాన సబిహానాజ్‌ను సన్మానించారు.
నియోజకవర్గ అభివృద్ధికి రూ.13.25 కోట్లు
ధర్మపురి: నియోజవర్గంలోని ఆరు మండలాల్లో చేపట్టే 245 సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు రూ.13.25 కోట్లకు పరిపాలన అనుమతుల లభించాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చొరవతో ఉపాధి కింద ఈ పనులు చేపట్టనున్నారు. ధర్మపురి మండలంలో 40 పనులకు రూ.273.80 లక్షలు, ఎండపల్లిలో 36 పనులకు రూ.212 లక్షలు, గొల్లపల్లిలో 56 పనులకు రూ.325.50 లక్షలు, పెగడపెల్లిలో 53 పనులకు రూ.241.50 లక్షలు, వెల్గటూర్‌లో 38పనులకు రూ.164.50, బుగ్గారంలో 22 పనులకు రూ. 108.50 లక్షలకు అనుమతి లభించింది.
కోరుట్ల నుంచి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు
కోరుట్లరూరల్: కోరుట్ల నుంచి పలు పుణ్యక్షేత్రాలకు కోరుట్ల ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. శక్తి పీఠాలైన కొల్లాపూర్, తుల్జాపూర్, పండరీపూర్ పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సు నడిపిస్తున్నామని, పెళ్లి, ఇతర శుభకార్యాలు ఉంటే ప్రజలు ఆర్టీసీని వినియోగించుకోవాలని కోరారు.


