కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దు

Jun 21 2026 6:22 AM | Updated on Jun 21 2026 6:22 AM

లోక్‌ అదాలత్‌లో జిల్లా జడ్జి రత్న పద్మావతి 80 ఏళ్ల సమస్యకు పరిష్కారం మోటార్‌ వాహనాల కేసులో రూ.1.24కోట్ల పరిహారం

జగిత్యాలజోన్‌: చిన్నచిన్న సమస్యలకు పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లాకోర్టులో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మాట్లాడుకుంటూ చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల సమస్యలు చిన్నవని, కోర్టుల వరకూ చేరితే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. కోర్టులపై భారం పడకుండా లోక్‌అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ రాజీ ద్వారా ఇరువర్గాలకు ప్రశాంత వాతావరణం లభిస్తుందన్నారు. మొదటి అదనపు జడ్జి సునీత మాట్లాడుతూ.. రాజీకొస్తే ఇద్దరూ గెలిచినట్టేనన్నారు. సబ్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. జీవితాన్ని కోట్లాటలు, గొడవలతో గడపవద్దని హితవు పలికారు. ఓ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బాధితురాలికి రూ.3లక్షల పరిహారాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందించారు. కా ర్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య, రెండవ అదనపు జడ్జి నిఖిషా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.

80 ఏళ్ల సమస్యకు పరిష్కారం

ఆస్తి తగాదాకు సంబంధించి 80 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారు. జగిత్యాలకు చెందిన నీలి కాశీనాథం, నీలి సంతోష్‌కుమార్‌, మరో 30 మంది మూడుతరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఆ సమస్యను ఏడాది క్రితం కోర్టులో వేయడంతో జడ్జిలు రత్న పద్మావతి, సునీత ఇరువర్గాలతో చర్చలు జరిపి లోక్‌ అదాలత్‌లో పరిష్కరించారు.

యాక్సిడెంట్‌ కేసులో రూ 1.24 కోట్ల పరిహారం

రాయికల్‌ మండలం భూపతిపూర్‌కు చెందిన కోమటిరెడ్డి రవిష్‌కుమార్‌ ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ.. కానిస్టేబుల్‌గా సెలెక్ట్‌ అయ్యాడు. 2023లో యాక్సిడెంట్‌కు గురికావడంతో కాలును తొలగించారు. దీంతో ఆయన కేసు వేయడంతో ఇన్సూరెన్సు సంస్థ దిగొచ్చి రూ.1.24 కోట్ల పరిహారం అందించేందుకు అంగీకారం తెలిపి.. కేసును రాజీ చేసుకుంది.

విడిపోయి...కలిసిపోయారు

జగిత్యాలకు చెందిన రమేశ్‌తో కథలాపూర్‌కు చెంది న మంజులకు 2021లో పెళ్లయ్యింది. చిన్న మనస్పర్థల కారణంగా కోర్టులో విడాకులకు దాఖలు చేశా రు. ఇద్దరు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నవారు కావడంతో ఇరువర్గాల న్యాయవాదులు, జడ్జిలు ప్రత్యేక చొరవ తీసుకుని వారిని ఏకం చేశారు.

లోక్‌ అదాలత్‌లో 5,444 కేసులు పరిష్కారం

జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి కోర్టుల్లో శనివారం జరిగిన లోక్‌ అదాలత్‌లో 5,444 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 34 సివిల్‌, 5,142 క్రిమినల్‌, 268 ప్రిలిటిగెంట్‌ కేసులున్నాయి. జగిత్యాల కోర్టులో 2,469, మెట్‌పల్లిలో 1,645, కోరుట్లలో 700, ధర్మపురిలో 630 కేసులు పరిష్కారమయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement