జగిత్యాలక్రైం/కోరుట్ల: జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. వందలాది చోట్ల పేకాటస్థావరాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు రూ.లక్షలు కూడబెట్టుకుంటున్నారు. కోరుట్ల మండలం సిరికొండ శివారులో కొద్ది రోజులుగా పేకాటస్థావరాలు ఏర్పాటు చేసి జోరుగా మూడుముక్కలాటను కొనసాగిస్తున్నారు. ఇది ప్రధాన రహదారికి కిలోమీటరు దూరంలోనే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లావాదేవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
మూడు జిల్లాల నుంచి పేకాట రాయుళ్ల రాక:
సిరికొండ స్థావరంగా జరుగుతున్న పేకాటకేంద్రానికి మూడు జిల్లాల నుంచి ఆటగాళ్లు వస్తున్నారు. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక వాహనాలు సమకూర్చుతున్నారు నిర్వాహకులు. కేంద్రానికి చేరుకున్న పేకాట రాయుళ్లకు మందు, విందు ఏర్పాటు చేసి పేకాటను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇలా ఇద్దరు నిర్వాహకులు కేవలం నెలరోజుల్లోనే రూ.40 నుంచి రూ.50 లక్షలు సంపాదించినట్లు సమాచారం.
‘మామూళ్లు’ చెల్లిస్తున్నామంటూ..
కొంతమంది పేకాటరాయుళ్లు పోలీసులు పట్టుకుంటారని భయాందోళన చెందుతుండగా.. నిర్వాహకులు తమ స్థావరానికి ఎవరూ రారని, వారికి నెలనెలా మామూళ్లు చెల్లిస్తున్నామని భరోసా ఇస్తున్నారు. ఇటీవల పేకాట ఆడిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించగా.. వారు రాకపోగా.. తిరిగి నిర్వాహకులకే సమాచారం అందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సమాచారం ఇచ్చినా పట్టుకోవడంలో విఫలం
పలుచోట్ల పేకాట జోరుగా సాగుతోందని, పోలీస్‌స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలోనే పేకాట ఆడుతున్నారని ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందిస్తే.. సదరు పోలీసులు వెంటనే నిర్వాహకుడికే సమాచారం చేరవేసి పేకాటరాయుళ్లను ఖాళీ చేయించిన విషయం బయటకు పొక్కింది. తర్వాత పోలీసులు నిదానంగా అక్కడకు చేరుకుని అక్కడ పేకాట నడవడం లేదని ఉన్నతాధికారులకు ఫొటోలు తీసి పంపించారు.
రహదారులకు సెంట్రీల ఏర్పాటు
పేకాట స్థావరానికి కొద్దిదూరంలోనే పేకాట నిర్వాహకులు సెంట్రీలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు ఎవరైనా అనుమానిత వ్యక్తులు వెళ్లినా, పోలీసు వాహనాలు కనిపించినా నిర్వాహకులకు సమాచారం అందిస్తుంటారు. నిర్వాహకులు వెంటనే స్థావరాన్ని ఖాళీ చేయిస్తున్నారు.
పేకాట స్థావరంగా ‘సిరికొండ’
జోరుగా సాగుతున్న పేకాట దందా
మూడు జిల్లాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లు
‘మామూళ్లు’ చెల్లిస్తున్నామంటున్న నిర్వాహకులు


