జిల్లాలో ఏర్పాటు చేసిన సులభ్‌కాంప్లెక్స్‌లకు ఎప్పుడూ తాళాలే దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానికులు, వివిధ పనుల నిమిత్తం మున్సిపాలిటీలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకేంద్రంతోపాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ నిర్వహణ గాలికొదిలేయడంతో నిరుపయోగంగా మారాయి.
జిల్లాకేంద్రంలో అంతంతమాత్రమే..
జగిత్యాల మున్సిపాలిటీతోపాటు జిల్లాకేంద్రం కూడా కావడంతో వచ్చిపోయే వారి సంఖ్య విపరీతం. ఈ క్రమంలో కొన్నిచోట్ల సులభ్‌కాంప్లెక్స్‌లు ప్రారంభించినా. సక్రమంగా సాగడం లేదు. మొదట్లో మహిళా సంఘాలకు మరుగుదొడ్ల బాధ్యతలు ఇచ్చారు. వారు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు లీజుకు ఇచ్చారు. వారు కూడా నిర్వహణ సక్రమంగా చేయకపోవడంతో ఇటీవల మున్సిపల్ అధికారులకు లేఖ రాశారు. నెలనెలా నిర్వహణకు డబ్బాలో నాలుగు షీట్లు ఉంటాయి. ఒక షీటుకు రూ.2500 చొప్పున రూ.10 వేలు చెల్లించేవారు. మహిళా సంఘాలు చేతులెత్తేయడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్ల నిర్వహణకు ఇటీవల మళ్లీ టెండర్లు నిర్వహించారు. టెండర్ దక్కించుకున్నవారు వారంలోపు ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నా.. అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. జిల్లాకేంద్రంలో ఒక్కో మరుగుదొడ్డికి రూ.6.5లక్షలతో 8 ఏర్పాటు చేయగా.. అందులో రెండుమూడు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. మిగిలిన ఆరుకూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక మరుగుదొడ్డిలో స్వీపర్, విద్యుత్, శానిటైజర్, సబ్బులు అందుబాటులో ఉండేలా చూడాలి. బోరు సౌకర్యం లేనిచోట మున్సిపాలిటీ తరఫున నీరు అందించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఎక్కడా అందుబాటులో లేవు. ట్యాంకులు పగలడం, ఎక్కువగా నీరు లీక్ అవుతుండడంతో సమస్య తలెత్తుతోంది. అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అందరికీ ఇబ్బందులు
జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో జనాభా పెరిగింది. వివిధ పనుల నిమిత్తం అత్యధికంగా మంది జిల్లాకేంద్రానికి వస్తూపోతుంటారు. ప్రధాన కూడళ్లతోపాటు ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ప్రతిచోట ఏర్పాటు చేసింది. అందమైన రంగురంగుల బొమ్మలతో ప్రారంభించినా.. నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేయడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. టవర్‌సర్కిల్ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఎప్పుడు చూసినా తాళాలే దర్శనమిస్తున్నాయి. ఇక మహిళల ఆత్మగౌరవనానికి భంగం వాటిల్లుతోంది.అధికారులు స్పందించి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
జగిత్యాల: మున్సిపాలిటీలకు వచ్చే ప్రజలు ఒంటికి.. రెంటికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి బల్దియాలో మరుగుదొడ్ల నిర్మాణానికి పూనుకుంది. ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండాలని భావించిన సర్కారు.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పెద్ద మున్సిపాలిటీలు. రాయికల్, ధర్మపురి కొత్తగా బల్దియాలుగా ఆవిర్భవించాయి. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అన్ని బల్దియాల్లోనూ మరుగుదొడ్లు నిర్మించింది. కానీ.. నిర్వహణ సరిగా లేకపోవడంతో వాటికి ఎప్పుడూ తాళాలు వేసే ఉంటున్నాయి. వాటి నిర్వహణ గతంలో మహిళా పొదుపు సంఘాలకు అప్పగించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వారితో నిర్వహణ సాధ్యం కాక చేతులెత్తేశారు. కొన్నిటి బాధ్యతలు తీసుకున్నా.. వేరే ఏజెన్సీకి అప్పగిస్తున్నారు.
టెండర్లు చేపట్టాం
ఇటీవలే టెండర్లు పిలిచాం. వారం రోజుల్లో మరుగుదొడ్లన్నీ ప్రారంభిస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మహిళ సంఘాలకే టెండర్లు ఇచ్చాం. ఏజెన్సీ వారు బాధ్యతలు తీసుకున్నారు. వారం రోజుల్లోపు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – అనిల్, మున్సిపల్ ఏఈ


