50శాతం కొనుగోళ్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

50శాతం కొనుగోళ్లు పూర్తి

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

● రూ.353.71కోట్లు రైతుల ఖాతాల్లో జమ ● వారంలో లక్ష టన్నుల ధాన్యం సేకరణ ● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: జిల్లాలో 50శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, రూ.353.71 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. 441 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని, ఈ సీజన్‌లో ఐదు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇప్పటివరకు 3.50 లక్షల టన్నులు కేంద్రాలకు రాగా.. 2.30 లక్షల టన్నులు కొనుగోలు చేశామన్నారు. 96 మిల్లులకు ధాన్యం తరలిస్తున్నామని తెలిపారు. మక్కలు 1.60 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా.. 1.20 లక్షల టన్నులు కొన్నామని, త్వరలోనే వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లత, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం జితేంద్రప్రసాద్‌ ఉన్నారు.

కొనుగోలు వేగవంతం చేయాలి

వెల్గటూర్‌: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎండపెల్లి మండలకేంద్రంలోని వాయుపుత్ర రైస్‌మిల్‌, గుల్లకోటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమశాతం వచ్చిన వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, డీసీఎస్‌వో జితేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ అనిల్‌ పాల్గొన్నారు.

తూకంలో జాప్యం చేయొద్దు

పెగడపల్లి: ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు వెంటనే చేరవేయాలని కలెక్టర్‌ అన్నారు. మండలంలోని నంచర్ల, దీకొండ, రాంనగర్‌లో కేంద్రాలను పరిశీలించారు. మద్దులపల్లి కేంద్రాన్ని డీఆర్డీవో రఘువరణ్‌ పరిశీలించారు. ఏఎంసీ చైర్మన్‌ రాములుగౌడ్‌, సర్పంచులు లక్ష్మీనారాయణ, సురేందర్‌ రావు, వనజ, విండో చైర్మన్‌ వేణుగోపాల్‌, ఆర్డీవో మదుసూదన్‌, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీసీవో మనోజ్‌కుమార్‌, తహసీల్దార్‌ నిజామొద్దీన్‌, ఎంపీవో శశికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఓటరు జాబితాలో పొరబాట్లు ఉండొద్దు

జగిత్యాల: ఓటరు జాబితాలో పొరబాట్లు ఉండొద్దని కలెక్టర్‌ అన్నారు. ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూన్‌ 15 నుంచి 24 వరకు జాబితా తయారీ, సిబ్బందికి శిక్షణ, ప్రింటింగ్‌, 25 నుంచి జూలై 26 వరకు బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా, ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్‌ ఒకటిన తుది జాబితా ప్రచురిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement