నిర్ధారణ సర్వే చేస్తున్నాం
జగిత్యాల: చేయూత పథకం కింద చనిపోయిన వారి పేరిట బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే పింఛన్ డబ్బులను చాలాచోట్ల కుటుంబ సభ్యులు తీసుకుంటున్న దాఖలాలున్నాయి. అలాంటి వాటిని తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించి సజీవ నిర్ధారణ సర్వే చేపడుతోంది. ఈ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నైజ్ స్కాన్) చేపడుతున్నారు. లబ్ధిదారులు బతి కుంటేనే ఇక నుంచి పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. కొన్నిచోట్ల లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ జమ అవుతోంది. ఈ సర్వేతో అర్హులైన వారికి మాత్రమే పింఛన్ వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 2.19 లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులున్నారు. గతంలో పింఛన్‌దారుడు చనిపోతే.. వారి కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం అందిస్తేనే చనిపోయినట్లు తెలిసేది. కొందరివి తెలియకపోవడంతో ప్రతినెలా వారి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. కొన్నిచోట్ల బోగస్ పింఛన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా రు. ఎఫ్‌ఆర్‌ఎస్‌తో అర్హులైన వారికి అందనున్నా యి. ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల నివాసానికి వెళ్లి సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న ఫెషియల్ రికగ్నైజ్ యాప్‌తో స్కాన్ చేస్తారు. ఆధార్‌కార్డు డాటాతో వివరాలు మ్యాచ్ అవుతాయి. లబ్ధిదారులు చనిపోతే వారి వివరాలు నమోదు కావు. ఉపాధి కోసం వలస వెళ్లి స్థిరపడితే వారి గురించి తెలుసుకుని అధికారులు నిర్ధారణ చేసుకుంటారు. అర్హులై ఉన్నప్పటికీ అందుబాటులో లేకపోతే మూడునెలల్లో ఎఫ్‌ఆర్‌సీ కచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అధికారులు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, పట్టణాల్లో సర్వే చేస్తున్నారు.
నెల రోజుల పాటు సర్వే
జిల్లాలో 2లక్షలకు పైగా ఉన్న పింఛన్‌దారులకు సంబంధించిన సర్వే నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. చాలాచోట్ల చనిపోయిన వారికి సంబంధించిన పింఛన్లు బ్యాంక్ అకౌంట్లలో పడటం, ఇతరుల పేర్లు పెట్టి పింఛన్లు పొందిన సంఘటనలున్నాయి. తాజాగా బోగస్‌తోపాటు, చనిపోయిన వారి పేర్లు తొలగిస్తారు. ఇక నుంచి అర్హులకే పింఛన్లు అందుతాయి. పక్కదారి పట్టే అవకాశం ఉండదు.
కొత్త పింఛన్లపై ఆశలు
చేయూత పింఛన్ల మంజూరుపై గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, కార్యాచరణ కూడా రూపొందించడంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఈసారి వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ నిర్ధారణ కార్యక్రమం చేపట్టి చనిపోయిన/బోగస్ తొలగించిన అనంతరం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కొత్త పింఛన్లు జారీ చేయనున్నారు.
వృద్ధులు : 57,959
వితంతువులు : 43,332
దివ్యాంగులు : 16,099
గీత కార్మికులు : 3300
చేనేత కార్మికులు : 2059
పైలేరియా : 1600
ఒంటరి మహిళలు : 4530
బీడీ కార్మికులు : 88,405
బీడీ టేకేదారులు : 750
నిర్దారణ సర్వే ప్రారంభమైంది. ముఖ గుర్తింపు ఉంటేనే పింఛన్ వస్తుంది. వ్యక్తిగత ఖాతాల్లో పింఛన్లు పడతాయి. జూన్ 15 వరకు గ్రామాలు, పట్టణాల్లో గుర్తింపు సర్వే చేడతాం. నెల రోజుల్లో పూర్తిచేసి అర్హులందరినీ గుర్తిస్తాం.
– రఘువరణ్, డీఆర్డీఏ పీడీ


