జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం బీర్‌పూర్ మండలం చర్లపల్లి, నరసింహులపల్లి, కందెనకుంట, తుంగూర్‌లోని కేంద్రాలను పరిశీలించారు. తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. డాటా ఎంట్రీ చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
జనగణన వేగవంతం చేయాలి
జగిత్యాల: జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో మాట్లాడారు. ఈనెల 18 నుంచి 23 వరకు యువజన వారోత్సవాలు ఉంటాయని, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేలా డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈనెల 20న ఎస్‌కేఎన్‌ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు.
రైతులూ ఆందోళన వద్దు
జగిత్యాలరూరల్: రైతులు పండించిన చివరిగింజ వరకు కొంటామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. గతంలో కన్నా అత్యధిక ధాన్యం కొనుగోలు చేశామన్నారు. నియోజకవర్గంలోనే లక్ష క్వింటాళ్ల మక్కలు కొన్నామని పేర్కొన్నారు. అనంతరం బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో మక్కల కేంద్రాన్ని పరిశీలించారు. కేడీసీసీ మాజీ మెంబర్ ముప్పాల రాంచందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ చైర్‌పర్సన్ నక్కల రాధ, మాజీ సర్పంచులు తిరుపతిరెడ్డి, చెరుకు జాన్, గంగన్న, రాజిరెడ్డి, బాపురెడ్డి, గంగారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 13 మంది వారివారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఎస్పీ ఫిర్యాదుదారులతో మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
రోడ్డెక్కిన అన్నదాత
కథలాపూర్: ధాన్యం తూకంలో జాప్యం, బస్తాకు అదనంగా కోతలు వేసి నట్టేట ముంచుతున్నారని పేర్కొంటూ మండలం తాండ్య్రాల, కలిగోట గ్రామాల్లో సోమవారం రైతులు ధర్నా చేశారు. తాండ్య్రాల రైతులు కోరుట్ల– వేములవాడ మార్గంలో తాండ్య్రాల చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. లారీల కొరతతో బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 43 కిలోలు అయితేనే మిల్లులు దిగుమతి చేసుకుంటున్నాయని మండిపడ్డారు. పోలీసులు వచ్చి సముదాయించారు. తహసీల్దార్ రమేశ్ వచ్చి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వర్‌రావు, సర్పంచ్ రామొల్ల రమేశ్, గంగం గంగారెడ్డి, సీతరామ్ నాయక్, పాలెపు రాజేశ్, మంచాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


