ఆట నీదా..నాదా..! | - | Sakshi
Sakshi News home page

ఆట నీదా..నాదా..!

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

● ఆడుకున్నోళ్లకు ఆడుకున్నంత ● జిల్లాలో జోరుగా పేకాట ● పోలీసుల వరుస దాడులు ● నిర్వాహకులకు నేతల అండ నిఘా పెట్టాం

కోరుట్ల/జగిత్యాల క్రైం: ఆదివారం వచ్చిందంటే చాలు.. జిల్లాలోని మారుమూల మండలాల్లో ఏదో ఒక చోట పేకాట రాయుళ్లు పట్టుబడుతుండటం షరామాములుగా మారింది. నెలరోజుల వ్యవధిలోనే పేకాట ఆడుతున్న సుమారు పది బ్యాచ్‌లు పట్టుబడ్డాయి. ఇందులో కోరుట్ల, రాయికల్‌, మేడిపల్లి, జగిత్యాల పరిసరాల ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారే కావడం గమనార్హం. మొత్తంగా జిల్లాలో పేకాట వ్యవస్థీకృతంగా మారినట్లు తెలుస్తోంది. పేకాట నిర్వాహకులు నేతల అండతో తాము అన్నీ మేనేజ్‌ చేస్తున్నామని చెబుతూ విచ్చలవిడిగా మూడుముక్కలాట ఆడిస్తున్నారు.

ఎక్కడపడితే అక్కడే..

పేకాట నిర్వాహకులు కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి పరిసరాలతోపాటు ఎక్కడ వీలు చిక్కితే అక్కడ అప్పటికప్పుడు టెంట్లతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని పేకాట ఆడిస్తున్నారు. మామిడి తోటలు, కోరుట్ల పట్టణ శివారులో పేకాట ఆడటానికి అనువైన స్థలా లు ఎంచుకోవడంతోపాటు ఇళ్లలోనూ ఆడుతున్నారు. పదిహేను రోజుల్లో కోరుట్ల పరిసరాల్లో రెండు చోట్ల పేకాట రాయుళ్లు పట్టుబడటం దీనికి నిదర్శనం.

కొంత మంది వ్యక్తులు పేకాట ఆడించడానికి ఒక్కోరౌండ్‌కు రూ.10 వేల సిట్టింగ్‌ ఫీజు తీసుకుని ఆటగాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలూ కల్పిస్తుండటం గమనార్హం. ఇలా ఒక్కో చోట పేకాట నిర్వహిస్తున్న వారు ప్రతీరోజు కనీసం రూ. లక్ష దాకా వెనకేసుకుంటున్నట్లు సమాచారం. ఒకేచోట తరచూ పేకాట ఆడితే పోలీసులతో ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో రోజుకోచోటకు స్థావరాలు మారుస్తున్నారు. కొన్ని చోట్ల పేకాట రాయుళ్లకు కింది స్థాయి పోలీసు సిబ్బందితో సంబంధాలు కొనసాగుతున్నట్లు సందేహాలు ఉన్నాయి.

నిర్వాకులకు నేతల అండ..

పేకాట నిర్వహిస్తున్నవారికి కొన్నిచోట్ల రాజకీయ నాయకుల అండ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పేకాట ఆడే వాళ్లు తమకు పూర్తిస్థాయి భద్రత కల్పించే నిర్వాహకుల వైపు మొగ్గు చూపడం సహజం. ఈ క్రమంలో పేకాట నిర్వాహకులు తమకు రాజకీయంగా అండదండలు ఉన్నాయని, పోలీసు యంత్రాంగాన్ని మేనేజ్‌ చేసుకుంటున్నామని చెప్పి తమ పబ్బం గడుపుకుంటున్నట్లు తెలిసింది. కొంతమంది ఏకంగా అధికార పార్టీకి చెందిన కీలక నేతల వెంట తిరుగుతూ తమకు వారి అండ ఉందని చెప్పకనే చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. ప్రతినెలా అన్ని వర్గాలకు మామూళ్లు ముట్టజెపుతున్నామని చెప్పి ప్రచారం చేసుకోవడం.. తమ వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేకాట ఆడవచ్చని నమ్మ బలుకుతుండటంతో పేకాటకు బానిసలుగా మారిన వ్యక్తులు చాలా మంది లక్షల్లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు. పోలీసులకు దొరికిన సందర్బాల్లోనూ పేకాట రాయుళ్లను కేసు నుంచి తప్పిస్తామని చెప్పి మళ్లీ డబ్బులు వసూలు చేస్తున్న తీరు కలవరపెడుతోంది. జిల్లా పోలీసు యంత్రాంగం పేకాట నియంత్రణకు నిక్కచ్చిగా చర్యలు చేపట్టి వ్యవసనానికి బానిసలైన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

పేకాటపై పూర్తి నిఘా పెట్టాం. ఇప్పటికే చాలాచోట్ల పేకాట రాయుళ్లును పట్టుకున్నాం. ఎప్పటికప్పుడు పేకాట నియంత్రణ పక్కా చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సమాచారం ఉన్నా మాకు ఇవ్వాలి. చర్యలు తీసుకుంటాం.

– రాములు, డీఎస్పీ మెట్‌పల్లి.

Advertisement
 
Advertisement
Advertisement