సీఎం రేవంత్‌రెడ్డి బిచ్చగాడు | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డి బిచ్చగాడు

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

మోదీని పైసలు అడుక్కుంటున్నడు ఉత్తమ్‌కుమార్‌ పనికిమాలిన మంత్రి పీసీసీగా ఉన్నప్పుడు టికెట్లు అమ్ముకున్నడు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌

జగిత్యాలటౌన్‌: ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారన్న సీఎం రేవంత్‌ వద్ద పైసలు లేవని, అందుకే మోదీ దగ్గర బిచ్చగాడిలా అడుక్కుంటున్నాడని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ తానే తెచ్చానని రేవంత్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటుకు ఫైనల్‌ రిపోర్ట్‌ 2021లోనే వచ్చిందని, అప్పుడు రేవంత్‌ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఐపీఎస్‌లు కాంగ్రెస్‌ రంగు పూసుకుంటే కుదరదని, చట్ట పరిధిలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి బుద్ధి లేదని, ఉంటే కేంద్రీయ విద్యాలయానికి రెండెకరాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌కు టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకుంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌.. రెండున్నరేళ్లలో చేసిందేంటో చెప్పాలన్నారు. సంజయ్‌ ముమ్మాటికీ తిరిగి బీఆర్‌ఎస్‌కు వెళ్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిరసనలకు అనుమతి ఇచ్చిన ఎస్పీ అశోక్‌కుమార్‌ బీజేపీ ఆందోళనకు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. డే స్కాలర్‌ విద్యార్థుల రాకపోకలకు అందుబాటులో ఉండేలా నేషనల్‌ హైవేకు ఆనుకుని ఉన్న చల్‌గల్‌లోని వాలంతరీ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటును ప్రతిపాదిస్తే కేవలం రెండెకరాలు కెటాయించడం దారుణమన్నారు. స్థలం కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే అడ్డుపడటంతో ఏడాది వృథా అవుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు పాత రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement