మామిడి కొనుగోళ్లకు ఢిల్లీ వ్యాపారులు దూరం | - | Sakshi
Sakshi News home page

మామిడి కొనుగోళ్లకు ఢిల్లీ వ్యాపారులు దూరం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఒకప్పుడు మామిడికాయలతో కళకళలాడే జగిత్యాల మార్కెట్‌కు ఈ ఏడాది అనుకున్న స్థాయిలో కాయలు రాకపోవడంతో కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ ఏడాది పురుగులు, తెగుళ్లతో దిగుబడి అంతంతమాత్రంగానే రావడం.. మామిడి కాయలపై నల్లమచ్చలు, ధర తగ్గుతుందనే భావనతో రైతులు పక్వానికి రాని కాయలు తెంపుతుండటంతో ఈ ఏడాది మామిడి కొనుగోళ్లకు ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సీజన్‌ ప్రారంభమై నెల దాటినా జగిత్యాల మార్కెట్‌లో కేవలం నాలుగు వేల నుంచి ఐదు వేల టన్నుల కాయలు మాత్రమే కొనుగోళ్లు సాగాయి.

గిట్టుబాటు కాని ధరలు

జిల్లాలో ఎక్కువగా బంగినపల్లి, దశేరి, హిమాయత్‌ వంటి మామిడి రకాలు సాగవుతాయి. ఈ ఏడాది అంతంతమాత్రంగానే కాయలు ఉన్నా మార్కెట్లో సరైన ధర లేదు. కిలోకు రూ.30 నుంచి రూ.35 మాత్రమే ధర పెడుతున్నారు. కాయపై మంగు, నల్లమచ్చలు అంటూ రేటును రూ.20కి తగ్గిస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన కాయల్లో సైజ్‌ లేదని, రాటన్‌, సూట్‌ అంటూ రకరకాల పేర్లతో కాయలను గ్రేడింగ్‌ చేసి.. వ్యాపారులు తమకు తోచిన రేటును నిర్ణయిస్తున్నారు. ఫలితంగా తమకు కాయలు తెంపిన ఖర్చులు కూడా రావడం లేదని, రైతులు, లీజుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు దాదాపు రూ.50వేల నుంచి రూ.60వేలు ఖర్చు పెట్టి.. ఏడెనిమిది సార్లు రసాయన మందులు పిచికారీ చేశారు. లీజుదారులు ధర లేక, రైతులకు డబ్బులు చెల్లించలేక నానాయాతన పడుతున్నారు.

నిలిచిపోయిన ఎగుమతులు

జిల్లా నుంచి మామిడి ఢిల్లీ వ్యాపారుల ద్వారా ఇరాన్‌, సౌదీఅరేబియా, ఖతార్‌, దుబాయ్‌ వంటి దేశాలకు చేరుతుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మామిడికాయలను దేశీయంగా అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మామిడిపండ్లకు డిమాండ్‌ తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఒక్కో దుకాణం నుంచి రోజుకు 7 నుంచి8 లారీలు మామిడి లోడ్‌తో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే ఇప్పుడు ఒకట్రెండు కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రానికి ఎగుమతి చేయాల న్నా కనీసం కాయ బరువు 250 నుంచి 300 గ్రాము ల బరువు ఉండాలి. అయితేనే మార్కెట్‌లో ధర పలుకుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా కాయలను తెంపడం.. మార్కెట్‌కు తేవడం చేస్తున్నారు.

కాయలపై నల్ల మచ్చలు

పక్వానికి రాకముందే కోతలు

ఉత్తరాది రాష్ట్రాలకు అంతంతమాత్రమే ఎగుమతి

Advertisement
 
Advertisement
Advertisement