అకాడమ్మీల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

అకాడమ్మీల దోపిడీ

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

● యథేచ్ఛగా ఇంటర్‌ అడ్మిషన్లు ● ఎడ్యుకేషన్‌ సొసైటీలు, కోచింగ్‌ సెంటర్ల పేరిట దందా ● ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఇంటర్‌ బోర్డు అధికారులు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు

విద్యార్థులు మోసపోవద్దు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అకాడమీల పేరుతో ఇంటర్‌ చదువును వ్యాపారంగా మార్చుతున్నారు. ఎడ్యుకేషన్‌ సొసైటీలు, కోచింగ్‌ సెంటర్ల పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంటర్‌ బోర్డు, విద్యాశాఖ అనుమతి లేకుండా ఐఐటీ, జేఈఈ, నీట్‌ అకాడమీ అంటూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. భారీ హోర్డింగులతో ప్రచారం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంగా నిర్వహిస్తున్న బన్సాల్‌ క్లాసెస్‌, ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌కు అనుమతి లేదని, ఐఐటీ, నీట్‌, ఎఫ్‌సెట్‌ అకాడమీలు ఇంటర్‌ బోర్డు పరిధిలోకి రావని, వాటిలో విద్యార్థులు ప్రవేశాలు పొంది మోసపోవద్దని, తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించి అనుమతి ఉన్న కళాశాలల్లో చేర్పించాలని డీఐఈవో ఆంజనేయరావు ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

మాయలో తల్లిదండ్రులు

కరీంనగర్‌లోని ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌, బన్సాల్‌ క్లాసెస్‌ పేరిట ఉన్న కళాశాలలు ఐఐటీ, జేఈఈ, ఎన్‌ఐటీ, నీట్‌ ద్వారా మెడికల్‌ సీట్లు వచ్చేలా కోచింగ్‌ ఇస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులను నమ్మిస్తున్నాయి. అడ్మిషన్లు తక్కువయ్యే ప్రైవేటు జూనియర్‌ కళాశాలల నుంచి విద్యార్థులను తీసుకుంటూ.. అదే కళాశాల ద్వారా పరీక్షలు రాయిస్తున్నారు. తరగతులు మాత్రం అకాడమీల్లో నిర్వహిస్తున్నారు. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

నగరంలో పుట్టగొడుగుల్లా..

కరీంనగర్‌ కేంద్రంగా అనుమతి లేని అకాడమీలు, కోచింగ్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అడ్మిషన్‌ తీసుకుంటే చాలు అంతా తామే చూసుకుంటామని, ఇచ్చే ఫీజును బట్టి సర్టిఫికెట్‌ చేతిలో పెడతామని ఆఫర్‌ ఇస్తున్నారు. ఎక్కడో ఒకచోట బిల్డింగ్‌ అద్దెకు తీసుకోవడం.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఎడ్యుకేషనల్‌ అకాడమీ పెట్టడం.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే బోర్డు తిప్పేయడం ఇక్కడ సాధారణమైపోయింది. ఎలాగోలా పిల్లలతో డిగ్రీ పూర్తి చేయించాలనుకునే తల్లిదండ్రులు, కళాశాలకు వెళ్లకుండా.. పరీక్షలు రాయకుండా పాస్‌ కావాలనుకునే యువతను టార్గెట్‌ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తమ వద్ద చేర్చుకుని హాస్టల్‌ పేరిట తమవద్దే ఉంచుకుంటారు. పరీక్ష రాసేందుకు వీలుపడని వారుంటే వారి నుంచి ప్రత్యేకంగా నగదు తీసుకుని ‘మమ’ అనిపిస్తున్నారు.

పదుల సంఖ్యలో కేంద్రాలు

కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో సుమారు 20.. ఉమ్మడి జిల్లాల్లో మరో 40 కోచింగ్‌ సెంటర్లు, అకాడమీలు విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్నాయని ఎంఈవోల రహస్య సర్వే ద్వారా విద్యాశాఖ గుర్తించింది. చాలా సెంటర్లలో నవోదయ, కోరుకొండ, గురుకులం విద్యాలయాల ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ట్యుటోరియల్స్‌ అనుమతి లేకుండా నడుస్తున్నాయని నివేదిక ఇచ్చారు.

ఈ నిబంధనలు తప్పనిసరి

● అకాడమీల్లో శిక్షణకు వచ్చే వారంతా కూర్చోవడానికి అనుకూలమైన కుర్చీలు, బల్లలు ఉండాలి

● విశాలమైన శిక్షణ గదులు, గాలి, వెలుతురు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

● విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు ఉండాలి

● గ్రంథాలయం తప్పనిసరి

● శిక్షకుల విద్యార్హతల సర్టిఫికెట్లు విద్యాశాఖ అధికారులకు అందుబాటులో ఉండాలి

● బోధకుల విద్యార్హతల్లో తేడా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

జిల్లాలో అనుమతిలేని అకాడమీలు, కోచింగ్‌ సెంటర్లలో ప్రవేశాలు పొంది విద్యార్థులు మోసపోవద్దు. జిల్లా కేంద్రంలోని ఆకాష్‌, బన్సాల్‌ లాంటి అకాడమీలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఇంటర్‌ కళాశాలల్లోనే పిల్లలను చేర్పించాలి.

– వి.ఆంజనేయరావు,

డీఐఈవో, కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement