జగిత్యాల: సమాచార హక్కు చట్టంతో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టంపై కలెక్టరేట్‌లో పీఐవోలు, ఏపీవోలకు అవగాహన కల్పించారు. ప్రజలు కోరిన సమాచారాన్ని తెలిపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకులన్నది మరిచిపోవద్దన్నారు. కోరినప్పుడే కాకుండా సెక్షన్ 4(1)బీ ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా అధికారులు సమాయత్తం కావాలన్నారు. సమాచార కమిషనర్లు శ్రీనివాస్‌రావు, దేశాల భూపాల్ మాట్లాడుతూ.. చట్టంలోని 6(3) కింద దరఖాస్తును చదివి పూర్తిస్థాయిలో తెలుసుకున్న అనంతరం అప్పిలేట్ అధికారి సమాచారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి వ్యక్తిగత జీవితంలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి, నైతిక విలువలు పెంపొందించే ముఖ్యమైన చట్టమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, వివిధస్థాయిల అధికారులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయండి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల ఇబ్బంది తీర్చాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. చల్‌గల్‌లోని మార్కెట్‌యార్డులో ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా కొనుగోలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఫలితంగా రైతులు కేంద్రాలవద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశారని తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్‌రావు, శీలం ప్రవీణ్, ఎల్ల రాజన్న, రమేశ్, వెంకటేశ్, కిశోర్, రైతులు పాల్గొన్నారు.
కేవీకి స్థలం కేటాయింపు
జగిత్యాల: జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి రెండెకరాల స్థలం మంజూరైందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. చల్‌గల్‌లోని వాలంతరి అటానమస్ అని, రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ స్థలాన్ని కేవీకి కేటాయించడం అభినందనీయమన్నారు. బీజేపీ నాయకులు కావాలని రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. చల్‌గల్‌లో స్థలం సరిపోకుంటే టీఆర్‌నగర్‌లో 30 ఎకరాల స్థలం ఉందని పేర్కొన్నారు.


