జగిత్యాలఅగ్రికల్చర్: మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు ఆదివారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. కూరగాయల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులకు విత్తనాలు, నారు అందిస్తోందన్నారు. రైతుబజార్ బ్రాండ్‌గా మారడంతో.. ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు జగిత్యాలకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల చుట్టుపక్క గ్రామాల రైతులు సంప్రదాయ పంటలతోపాటు అదనపు ఆదాయం ఇచ్చే కూరగాయల పంటలను సాగు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో త్వరలో రూ.9 కోట్లతో నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభం కానుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి స్వాతి, హెచ్‌ఈవో అనిల్, ‘ఆత్మ’ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, రైతు నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, సమిండ్ల శ్రీనివాస్, రౌతు గంగాధర్, బాల ముకుందం, మహేష్, నారాయణలు పాల్గొన్నారు.


