మార్క్‌ఫెడ్ సిద్ధం
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. మొన్నటి వరకు క్వింటాల్‌కు రూ.3వేలు పలికిన ధర.. రైతుల చేతికి రాగానే క్వింటాల్‌కు రూ.1800కు పడిపోయింది. దీంతో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర రూ.2400 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వంపై రైతులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు కొనేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ అదేశాలు అందిన మరుసటి రోజు నుండే కేంద్రాలను ప్రారంభించాలని అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
కేంద్రాలకు 9 నుంచి 10లక్షల క్వింటాళ్ల మక్కలు
జిల్లాలో వరి తర్వాత మక్కనే 35వేల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల అంచనా. యాసంగిలో అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఎకరాకు సగటున 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు సగటున 40వేల నుంచి 80వేల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
గన్నీసంచులు, ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ సిద్ధం
కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను ప్రధానంగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి గోదాంల్లో నిల్వ చేయనున్నారు. ఇందుకోసం లారీ యజమానులతో మాట్లాడి ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. సుమారు 3 నుంచి 4లక్షల గన్నీ సంచులను తెప్పిస్తున్నారు. మార్కెట్‌యార్డులు, సింగిల్ విండో కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ కొనుగోలుతో వ్యాపారులు దారికి..
ఇక్కడి కంటే తక్కువ రేటుకే ఇతర రాష్ట్రాల నుంచి మక్కలు వస్తున్నాయంటూ దళారులు ఓపెన్‌మార్కెట్‌లో రేటు తగ్గిస్తున్నారు. ప్రభుత్వ ధర.. వ్యాపారులు పెట్టే రేటుకు క్వింటాల్‌కు కనీసం రూ.600 నుంచి రూ.700 నష్టపోతున్నారు. ప్రభుత్వ సంస్థ రంగంలోకి దిగితే, కనీసం వ్యాపారులు ఆ రేటుకై నా గ్రామాల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది.
జగిత్యాల జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయం
జగిత్యాలలో 13
కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా ఉన్న ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మెట్‌పల్లి, రాయికల్, బీర్‌పూర్, భీమారం, మేడిపల్లి మండలకేంద్రాల్లో 13 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తీర్ణం, రైతుల డిమాండ్‌ను బట్టి పెంచే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీలు, డీసీఎం, సింగిల్ విండో కేంద్రాల్లో ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్ అధికారులు పర్యవేక్షించనున్నారు.


