ధర్మపురి/వెల్గటూర్: వెల్గటూ ర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ధర్మపురి మండలం రాయపట్నం వంతెనపైకి చేరుకుని గోదావరిలో దూకారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని స్థంభంపల్లికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. రాత్రిపూట దంపతులిద్దరూ బైక్‌పై రాయపట్నం వంతెన వద్దకు చేరుకుని చెప్పులు, బండి, ఫోన్ వంతెనపై వదిలేసి భార్యాభర్తలిద్దరూ గోదావరిలో దూకారు. లింగయ్యకు ఈత రావడంతో చివరి క్షణంలో మనసు మార్చుకుని మునిగిపోతున్న తన భార్యను వంతెన పిల్లర్ వద్ద ఇనుప కొక్కానికి చీరతో కట్టి తాను కూడా ఇనుప కొక్కెం పట్టుకొని సహాయం కోసం కేకలు వేశాడు. అదే సమయంలో వ్యక్తిగత పని నిమిత్తం అటుగా వచ్చిన మంచిర్యాల జిల్లా గుళ్లకోట గ్రామానికి చెందిన యువకులు వారి అరుపులు విని సమీపంలో ఉన్న జాలర్లకు విషయం తెలపడంతో వారు డైరెక్టర్ దంపతులను కాపాడి తెప్పలపై బయటకు తెచ్చారు. అప్పటికే నీటమునిగి లింగవ్వ అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దంపతులిద్దరినీ అంబులెన్స్‌లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు తెల్సింది.
అర్ధరాత్రి గోదావరిలో దూకిన వైనం
సమయానికి రక్షించిన యువకులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
కుటుంబ కలహాలే కారణమా..?


