జ్యోతినగర్: ‘అమ్మా.. బతకాలని ఉంది’ శీర్షికన ‘సాక్షి’ 2024లో కథనం ప్రచురించిన విషయం తెలిసింది. ఈ కథనానికి దాతలు స్పందించారు. చదువులతల్లి సిరి వైద్యానికి అండగా నిలిచారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని అనేకమంది ఆర్థికసాయం అందించారు. అయినా సిరి ప్రాణాలు దక్కలేదు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కూనారపు సిరి(19) కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో నివాసముంటున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సిరి చదువులో చాలాముందుండేది. అనారోగ్యంతో ఉన్న క్రమంలో ఆమె చికిత్సకు దాతలు సాయం అందించారు. తండ్రి కూడా తన తాహతుకు మించి వైద్యానికి ఖర్చు చేశారు. రెండు సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతూ సిరి తుదిశ్వాస విడిచింది. సిరి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
చదువులతల్లి సిరి కన్నుమూత
కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి


