● జంక్షన్ల సుందరీకరణ ఎక్కడ? ● చైర్‌పర్సన్ గారూ ఒక్కసార
జగిత్యాల: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా తయారైంది జగిత్యాల మున్సిపాలిటీ తీరు. జిల్లా కేంద్రంగా ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. గతంలో సుందరీకరణ పేరుతో డివైడర్ల మధ్యలో మొక్కలు, జంక్షన్ల వద్ద ఖరీదైన బొమ్మలు, లాన్‌లు, ఏర్పాటు చేశారు. అవి కొద్దిరోజులు మాత్రమే ఆహ్లాదంగా కనిపించాయి. గత పాలకవర్గం, అధికారులు పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కళాహీనంగా మారుతున్నాయి. బొమ్మలు దుమ్ముపట్టి, లాన్ ఎండిపోయి, మొక్కలు పిచ్చిమొక్కలుగా తయారవుతున్నాయి.
ప్రజల సొమ్ము దుర్వినియోగం
ఇప్పుడిప్పుడే జిల్లాకేంద్రం అభివృద్ధి చెందుతోంది. వేలాది మంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్లు, జంక్షన్లు గ్రీనరీతో ఉండాలన్న ఉద్దేశంతో సుందరీకరణ పేరుతో గతంలో సుమారు రూ.35 లక్షలు వెచ్చించారు. జంక్షన్ల మధ్యలో నెమలి, కొంగలు, మనిషి ఆకారం పోలే బొమ్మలు, ఫౌంటేన్, లాన్ ఏర్పాటు చేసి కొన్ని మొక్కలు నాటారు. ఏర్పాటు చేసిన రెండు నెలల పాటైనా ఫౌంటేన్ల నిర్వహణ కొనసాగలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రూ.35 లక్షల నిధులు వృథాగా పోతున్నాయి. జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటేన్లు పనిచేయాలంటే మోటర్లు ఉండాలి. అవి చెడిపోవడంతో మరమ్మతు చేయించడం లేదు. అప్పుడప్పుడు ట్యాంకర్ల ద్వారా నీరు పడుతున్నారు. ఫౌంటేన్‌తో పాటు వివిధ రంగుల్లో నీరు పోసేలా సైతం లైట్లను సైతం ఏర్పాటు చేశారు. ఆ లైట్లు కాస్త పనిచేయడం లేదు. వచ్చేది ఎండాకాలం కావడంతో నూతనంగా ఎన్నికై న జగిత్యాల మున్సిపల్ పాలకవర్గం ఈ జంక్షన్లపై శ్రద్ధ చూపి వాటి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం పనిచేయాలి
ఫౌంటేన్లను నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి మున్సిపాలిటీలో వీటిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్, పాతబస్టాండ్‌లలో అత్యధిక జనం సంచరిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలు వెళ్తూ వస్తుంటాయి. ఆహ్లాదం లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది.
– మచ్చ శంకర్, జగిత్యాల
ఫౌంటేన్లతో అందం
జిల్లా కేంద్రంలో ఉన్న ఫౌంటేన్లను బాగుచేయాలి. అందులో ఏర్పాటు చేసినవన్నీ కళాహీనంగా మారాయి. వాటిని సైతం బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రం కావడంతో నిత్యం వందలాది మంది వస్తుంటారు. జంక్షన్లు, డివైడర్ల మధ్యలో నీరు పోస్తుంటే చల్లదనంగా సైతం ఉంటుంది.
– కల్యాణ్, జగిత్యాల
● జంక్షన్ల సుందరీకరణ ఎక్కడ? ● చైర్‌పర్సన్ గారూ ఒక్కసార


