అన్ని గ్రామాల్లో భూముల రీ సర్వే
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): రైతులు అధికారుల వెంట ఉండి భూములను సర్వే చేయించుకోవాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. శుక్రవారం మండలంలోని బర్థీపూర్‌లో భూ భారతి రీసర్వేపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలోని 326 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. బర్థీపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడి నుంచి రీ సర్వే చేపట్టినట్లు వివరించారు. సర్వే సమయంలో చుట్టుపక్కల వారు కూడా ఉంటే ఎలాంటి తగాదాలు ఉండవన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది, కోడిగుడ్డు పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని ఎర్దండి గోదావరి వద్ద పుష్కర్‌ఘాట్‌లను పరిశీలించారు. తహసీల్దార్ వరప్రసాద్, డీఐ దేవరావు, ఏడీ కృష్ణప్రసాద్, సర్వేయర్ భార్గవి, ఆర్‌ఐ రమేశ్, సర్పంచు అమృత తదితరులు పాల్గొన్నారు.


