‘ప్రజా బాట’.. సమస్యలకు టాటా
జగిత్యాలఅగ్రికల్చర్: గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజా బాట(పొలం బాట) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా విద్యుత్ సమస్యలు గుర్తించి, ఒకట్రెండు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు.
జిల్లాలో 203 ప్రజా బాట కార్యక్రమాలు
జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 203 ప్రజా బాట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఏఈలు, లైన్‌మెన్‌లు, హెల్పర్లు గ్రామాన్ని సందర్శించి రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మోటార్ల వద్ద తీసుకునే జాగ్రత్తలు వివరిస్తున్నారు.
కొత్త స్తంభాలు.. మరమ్మతులు
విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వైర్లు కిందికి వేలాడుతున్న తీగల మధ్య కొత్తగా 1,349 స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే, ఈదురుగాలులకు వంగి, రైతులకు ఇబ్బందిగా మారిన 303 స్తంభాలను సరిచేశారు. స్తంభాల మధ్య వేలాడుతున్న 1,874 లూజ్ లైన్లను గట్టిగా బిగించారు. తక్కువ ఎత్తులో ఉన్న 142 ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెలను ఎక్కువ ఎత్తుకు పెంచారు. ప్రమాదకరంగా ఉన్న 1,412 డబుల్ ఫీడింగ్, లో–లెవల్ లైన్ క్రాసింగ్‌లను సరిచేశారు. ఎక్కువ ఎత్తులో ఉండే హార్వేస్టర్ వాహనాలు వెళ్లేచోట ప్రమాదాలు జరుగకుండా 9.1 మీటర్ల ఎతైన స్తంభాలు వేశారు. జిల్లాలో చాలా చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటంతో వాటికి సరైన ఎర్తింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు.
జీరో విద్యుత్ ప్రమాదాల కోసం..
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా గ్రామాల్లో రైతులు, విద్యుత్ సిబ్బంది చేత చైతన్య ర్యాలీ నిర్వహిస్తున్నారు. విద్యుత్ మోటార్లు, స్టార్టర్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రయోగత్మకంగా వివరిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా డీఈ(టెక్నికల్) అధికారులను ప్రత్యేక సేఫ్టీ అధికారులుగా నియమించి వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు.
ఏ సమస్య ఉన్నా 1912 టోల్‌ఫ్రీ..
విద్యుత్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఉన్నతాధికారులకు తెలిపేందుకు జిల్లాస్థాయిలో 1912 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. రైతులు స్వతహాగా ట్రాన్స్‌ఫార్మర్ల ప్యూజులు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్, ఆన్ చేయవద్దని, ఏ సమస్య ఉన్నా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.
ప్రమాదాలు జరగకుండా..
జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం. ఆ మేరకు గ్రామాల్లో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నాం. విద్యు త్ ప్రమాదాలపై అవగాహన పెంచుతున్నాం. విద్యుత్ సమస్యలు మా దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– బి.సుదర్శనం,
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ, జగిత్యాల
‘ప్రజా బాట’.. సమస్యలకు టాటా


