గ్రామాల్లో ఆదర్శ పాలన అందించాలి
జగిత్యాలరూరల్: గ్రామాల్లో ఆదర్శ పాలన అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సర్పంచులకు సూచించారు. సర్పంచుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నూకపల్లిలోని న్యాక్ సెంటర్‌లో సోమవారం ప్రారంభించారు. ఐదేళ్లలో గ్రామాల్లో సొంత మార్క్ ఉండేలా.. పేరు చిరస్థాయిగా నిలిచేలా పనిచేయాలన్నారు. పాలనలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, పన్నులతో గ్రామానికి అవసరమైన పనులు చేయాలని సూచించారు. పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూప కల్పన, పాలన వ్యవహారాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీన్‌బడ్జెట్ అంశాలపై శిక్షణ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీలో మార్పులను గమనించాలని, నూతన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతుల మంజూరుకు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు తప్పనిసరిగా ఎంబీ రికార్డు నమోదు చేయాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచులు 14 రకాల రిజిస్టర్లు, గ్రామసభలు నిర్వహించాలని, అన్నిరకాల నిబంధనలు పాటించాలని వివరించారు. నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, క్రీడామైదానాలనుఉపయోగంలోకి తేవాలన్నారు. కార్యక్రఓమంలో డీపీవో మదన్ మోహన్, డిప్యూటీ సీవో నరేశ్, శిక్షణ డీపీవో రేవంత్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, టీవోటీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఆదర్శ పాలన అందించాలి


