వైద్య కళాశాలకు మహర్దశ
జగిత్యాల: జగిత్యాల.. జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత 2022లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది. ధరూర్ క్యాంప్‌లో గల ఆగ్రోస్ భవన్‌లో సుమారు 27 ఎకరాల్లో మెడికల్ కళాశాల నిర్మాణానికి సర్కారు సంకల్పించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భవనాలకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మెడికల్ కళాశాల నిర్వహణకు తాత్కాలికంగా ఆగ్రోస్‌కు సంబంధించిన గోదాముల్లో రెనోవేషన్ కోసం రూ.14 కోట్లు కేటాయించారు. అప్పటినుంచి వైద్య తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడో సంవత్సరం బ్యాచ్ కొనసాగుతోంది. మెడికల్ కళాశాల భవనం, హాస్టళ్ల నిర్మాణానికి మొదటి విడతగా.. రూ.115 కోట్లు మంజూరు చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సుమారు రూ.65 కోట్ల వరకు పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలను నిలిపివేశారు. కళాశాల భవనం స్లాబ్‌తోపాటు గోడలు పూర్తయ్యాయి. బాయ్స్, గర్‌ల్స్ హాస్టల్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.
నిర్మాణాలకు రూ.500 కోట్లు
70 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయిన వైద్య కళాశాలలను తొలుత అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భవనాల్లో జగిత్యాల కూడా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.500 కోట్లు విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని నిర్మాణాల కోసం నవంబర్ నుంచి 2026 వరకు ప్రతినెలా రూ.340కోట్లు కేటాయించనున్నారు. తొలి దశలో నిర్మించిన వైద్య కళాశాలలకు నిర్మాణాలకు సంబంధించి బకాయిల చెల్లింపుతో పాటు, మిగిలిపోయిన పనులను ఈ నిధులతో పూర్తిచేయనున్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు
మెడ్‌కో విద్యార్థులకు గోదాముల్లో తరగతి గదులు ఏర్పాటు చేసినా అవి ఆశించిన స్థాయిలో లేవు. విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. బాయ్స్ హాస్టల్ ఓ ప్రైవేటు బిల్డింగ్‌లో కొనసాగుతుండగా.. గర్‌ల్స్ హాస్టల్‌ను నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మెడ్‌కో విద్యార్థులు నర్సింగ్ కళాశాలలో ఉండటంతో ఆ విద్యార్థులకూ ఇబ్బందికరంగా మారింది.
భవన నిర్మాణానికి మంత్రి హామీ
మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని అప్పట్లో జిల్లాలో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రస్తుత మంత్రి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వినతిపత్రం అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలి దశలో కొన్ని కళాశాలలకు నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. నిధులు ఈ నెలలోనే మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మెడికోల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నిధుల లేమితో నిలిచిన పనులు
నత్తనడకన సాగుతున్న నిర్మాణం
తాజాగా కళాశాలకు రూ.500 కోట్లు
నిధుల విడుదలతో వేగవంతమయ్యే అవకాశం


