ప్రయాణం.. నరకప్రాయం
రోడ్ల మధ్యలో గుంతలు తరచూ ప్రమాదాలు గాయపడుతున్న వాహనదారులు మరమ్మతుకు చర్యలు శూన్యం పట్టించుకోని అధికారులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం.. పైగా అతిపెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ ఉన్న రహదారులు అన్నీ ప్రధానమైనవే. ఈ రహదారులు అడుగడుగునా గుంతలమయంగా మారాయి. గుంతలే కదా అని ఆదమరిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సోమవారం చేవెళ్ల సమీపంలో కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సు పైకి ఒరిగిపోవడంతో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి గుంతలు జగిత్యాలలో అత్యధిక రద్దీ గల ప్రాంతాల్లో అనేకం ఉన్నాయి. వీటికి మరమ్మతు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం ప్రమాదాలే
ఈ గుంతల వల్ల నిత్యం ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయి. చిన్నచిన్న వాహనదారులు గుంతలను గమనించకపోవడంతో అందులో పడి తీవ్రగాయాలపాలవుతున్నారు. వర్షకాలమైతే ఆ గుంతల్లో నీరు నిలవడంతో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నా యి. ప్రధాన సెంటర్లు కావడం.. అత్యధిక రద్దీ ఉన్న ఈ సెంటర్లలో వెంటనే మరమ్మతు చేపడితే తప్ప ప్రమాదాలను అరికట్టలేం. అధికారులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో నిర్మించిన రోడ్లు కావడంతో పూర్తిగా చెడిపోయాయని, నూతన రోడ్లు వేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఇది జగిత్యాల–కరీంనగర్ రహదారి బైపాస్ చౌరస్తా. రెండు వైపులా
పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వచ్చే వాహనాలు, జగిత్యాల నుంచి బైపాస్‌కు వెళ్లే వాహనాలు అందులో పడిపోతున్నాయి. రాత్రివేళ చూసుకోకపోవడంతో వాహనాలు అందులో పడి ప్రమాదాలు జరగడంతోపాటు వాహనాలు చెడిపోతున్నాయి. అధికారులు స్పందించి ఈ చౌరస్తా వద్ద మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.
ప్రయాణం.. నరకప్రాయం


