
మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు
జగిత్యాలక్రైం: జిల్లాలో 71 మద్యం దుకాణాలకు ప్రభుత్వం గడువు పెంచింది. ముందుగా ఈనెల 18న చివరి రోజుగా ప్రకటించడంతో శనివారం పొద్దుపోయేదాకా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా 1,834 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ప్రభుత్వానికి రూ.55.02కోట్ల ఆదాయం సమకూరింది. అయితే దీపావళి సెలవులతోపాటు శనివారం బీసీ సంఘాలు రాష్ట్ర బంద్ నిర్వహించడం.. బ్యాంకులకు సెలవు ప్రకటించడంతో సర్కారు దరఖాస్తులకు గడువు పెంచింది. దీని ప్రకారం.. ఈనెల 23వరకు టెండర్లు వేసేందుకు అవకాశం ఉంది. 2023–25కి గాను 2,636 దరఖాస్తులు రాగా.. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు చొప్పున ప్రభుత్వానికి రూ.52.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి 1,834 దరఖాస్తులు రాగా ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున రూ.55.02కోట్లు ఆదాయం వచ్చింది. గడువు పెంచడంతో మరిన్ని దరఖాస్తులు రానున్నాయి. ఈనెల 27న జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వాహకులను డ్రాపద్ధతిలో ఎంపిక చేయనున్నారు.