
రాజన్నను దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి
● ఘనస్వాగతం పలికిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్ ● పూర్ణకుంభ కలశంతో ఆలయ అర్చకుల స్వాగతం
వేములవాడ: ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి ఆదివారం రాత్రి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం పూర్ణకుంభ కలశంతో స్వామి వారికి స్వాగతం పలికారు. స్థానిక తెలంగాణచౌక్‌కు చేరుకున్న స్వామీజీ ప్రత్యేక రథంపై ఆసీనులయ్యారు. జేసీబీ సహాయంతో గజమాల వేశారు. ఒగ్గుడోలు, భజన మండలి కళాకారులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్వామీజీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.
పెద్దమ్మ స్టేజీ వద్ద జిల్లాలోకి..
గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి చేపట్టిన విజయ ధర్మ యాత్ర గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. బాసర నుంచి వస్తున్న స్వామీ యాత్రకు పెద్దమ్మస్టేజీ, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు.

రాజన్నను దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి