
మళ్లీ..అదే తీరు
దాడులకు తెగబడుతున్న ఇసుక అక్రమ రవాణాదారులు
పక్షం రోజుల వ్యవధిలో రెండు సంఘటనలు
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
‘రెవెన్యూ’పై ఒత్తిడి పెంచుతున్న రాజకీయ నాయకులు
● పదిహేను రోజుల క్రితం.. కోరుట్ల పట్టణ శివారులో ఇసుక అక్రమ రవాణాదారు ఓ ఆర్‌ఐ, ముగ్గురు వీఆర్‌ఏలపై దాడికి దిగి మామూళ్ల ప్రస్తావన తెస్తూ దూషించాడు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల వరకూ రెవెన్యూ అధికారులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అతికష్టంపై మోహమాటానికి ఫిర్యాదు చేసినా.. అంతలోనే రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎడారి దేశానికి వెళ్లిపోయాడు.
● రెండు రోజుల క్రితం కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి సమీపంలో ఓ ఇసుక డంప్ నుంచి లారీలు, టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తమనే అడ్డుకుంటారా..? అని సదరు అక్రమ రవాణాదారులు గొడవ చేసి.. సిబ్బందిపై దాడి చేసి.. వారిని తోసేసి ఇసుకతో లారీలు, టిప్పర్లను దర్జాగా తీసుకెళ్లారు. ఈ విషయమై దాడికి గురైన సిబ్బంది రెవెన్యూ అధికారులకు తెలిపితే ‘పోనీలే’..అంటూ రాజీ పడటం విశేషం.
కోరుట్ల: ఈ రెండు సంఘటనల్లోనూ రెవెన్యూ ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కలవరం రేపుతోంది. రాత్రి..పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవడానికి కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది అధికారుల తీరుతో అభద్రత భావంతో ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమ రవాణాదారులు దాడులకు పాల్పడుతున్నా.. ఫిర్యాదు చేయడంలో చూపుతున్న ఉదాసీనతకు ‘మామూళ్ల మత్తు’ కారణమా.. లేక రాజకీయ ఒత్తిళ్ల ఫలితమా..? అనే విషయం తేలడం లేదు. ఈ రెండు సంఘటనలు జరిగిన వెంటనే కోరుట్ల, కథలాపూర్ సరిహద్దుల్లోని సిరికొండ, బొమ్మెన, నాగులపేట, సంగెం ఏరియాల్లోని వాగుల్లో కనీసం గట్టి ఏర్పాట్లు చేసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారా.. అంటే అదీ లేదు. ఓ వైపు రెవెన్యూ సిబ్బందిపై వరుస దాడులకు తెగబడుతూనే.. మరోవైపు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా లారీలు, టిప్పర్లతో కోరుట్ల నుంచి జగిత్యాల, మెట్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వైపు తరలిస్తున్నారు.
ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు..?
ఇసుక అక్రమ రవాణాను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాల్సిన కింది స్థాయి సిబ్బంది దాడుల భయంతో విధుల నిర్వహణపై అనాసక్తితో ఉండగా.. పైస్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోరుట్ల, కథలాపూర్ మండలాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది కీలక నేతలు ఈ ఇసుక అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడిన వెంటనే కీలకనేతల ఫోన్‌లు రావడంతో తప్పనిసరై వదిలేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే తమ సిబ్బందిపై దాడులు జరుగుతున్నప్పటికీ.. పట్టింపులేని ధోరణితో రాజీబాటను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. చివరికి కొంతమంది అధికారులు ‘నలుగురితో నారాయణ’ అన్న చందంగా అమ్యామ్యాలకు ఆశపడి నిర్లిప్తంగా ఉండక తప్పనిసరి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో ఓ వైపు భూగర్భజలమట్టం పడిపోయే ప్రమాదం పొంచి ఉండటంతోపాటు..ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతోందన్న మాట వాస్తవం.