ఇల్లంతకుంట(మానకొండూర్): అది పేరుకే పల్లెటూరు. ఆ ఊరిలోని యువత దారి అమెరికా, యూరప్ దేశాలు. దాదాపు ప్రతీ ఇంటిలో ఉన్నత విద్యావంతుడు ఉంటారు. ఇప్పటికే 34 మంది విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడగా.. గ్రామంలోనే ఉంటున్న 17 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత ఉన్నత చదువులు.. విదేశాల్లో కొలువులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో చదువుకుంటున్నారు. కుగ్రామం ముస్కానిపేట విజయగాథపై సండే స్పెషల్.
ముస్కానిపేట గ్రామం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో అతి పురాతనకాలం నాటి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుండగా.. గ్రామం మొదట్లో దేవతామూర్తుల చిత్రాలతో ఆర్చి స్వాగతం పలుకుతుంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్‌లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్‌గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్‌గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు.
ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్‌ఈసీ)లో ఇంజినీరింగ్ చదివారు. గ్రామంలో నిధులు సమకూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటి వ్యక్తిగా 1961లో అమెరికాకు వెళ్లారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.
అమెరికా, యూరప్ దేశాల్లో యువత
విదేశాల్లో పనిచేస్తున్న 34 మంది
17 మంది ప్రభుత్వ ఉద్యోగులు
ముగ్గురు బ్యాంక్ మేనేజర్లు
ఒక డాక్టర్.. ఇదీ ఆ పల్లె విజయగాథ
ముస్కానిపేట డాలర్ల పంట