
ఆధ్యాత్మిక జాడ.. ఎములాడ
శిల్పకళకు పుట్టినిల్లుగా భీమేశ్వరాలయం నగరన్న గుడిలోనూ ఆర్జిత సేవలు పట్టణంలోని అన్ని ఆలయాల్లో భక్తులు ఆధ్యాత్మికతను వెదజల్లుతున్న ఎములాడ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం.. వేములవాడలోని అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. రాజన్న ఆలయ విస్తరణతో భీమన్నగుడిలో దర్శనాలు ప్రారంభం కావడం.. పట్టణంలోని వివిధ ఆలయాల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మికతను వెదజల్లుతున్నాయి. వేములవాడలోని ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఇన్నాళ్లు పెద్దగా పేరుగాంచని ఆలయాలు నేడు ప్రఖ్యాతి చెందుతున్నాయి.
విస్తరణ పనులు షురూ..
రాజన్న ఆలయాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం దాదాపు రూ.150 కోట్లతో విస్తరణ, అభివృద్ధి పనుల్ని ప్రారంభించింది. ఇందులో మొదటి దశలో రూ.76 కోట్లతో ప్రాముఖ్యమైన అభివృద్ధి పనులు, రూ.35కోట్లతో అన్నదానసత్రం, రూ.53కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పనులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు దరిచేరనున్నాయి.
భవిష్యత్ స్వరూపం
ఈ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత వేములవాడ క్షేత్రం మరింత ప్రఖ్యాతి చెందనుంది. ప్రస్తుతం భక్తులకు తాత్కాలిక అసౌకర్యం కలిగినా.. విస్తరణ పనులు పూర్తయితే ఆలయానికి గుర్తింపు రానుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
భీమన్న గుడి ప్రాశస్త్యం ఇదీ
రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వరస్వామి గుడి శిల్పకళా వైభవానికి పెట్టింది పేరు. క్రీస్తుశకం 850–895 ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. గతంలో భాగేశ్వర ఆలయంగా పిలిచేవారని, కాలక్రమేణ భీమేశ్వరాలయంగా పిలుస్తున్నారని స్థానికులు చెబుతుంటారు. భీమన్న గుడి రాతితో నిర్మించారు. ద్వారపాలకులు, గజలక్ష్మీ వంటి వారిని శిల్పాలపై అద్భుతంగా చెక్కారు. మండపానికి చుట్టూ ఉన్న నాలుగు స్తంభాలకు నాలుగు విధాలైన శిల్పకళ కనిపిస్తుంది. 2011లో భీమన్న గుడిని పురావస్తుశాఖ ద్వారా అభివృద్ధి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్‌కు ఆలయ అధికారులు లేఖ సైతం రాశారు. విశాలమైన గర్భగుడితోపాటు భారీ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ఆర్జిత సేవలు ఈ క్షేత్రంలో జరుగనున్నాయి.

ఆధ్యాత్మిక జాడ.. ఎములాడ