
పీజీ మెడికల్ కాలేజీగా సిమ్స్
వైద్యకళాశాలకు పీజీ సీట్లు మంజూరు నాలుగు విభాగాల్లో నాలుగు చొప్పున కేటాయింపు మంజూరు చేసిన నేషనల్ మెడికల్ కౌన్సిల్
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) కాలేజీకి పీజీ మెడికల్ కాలేజీగా గుర్తింపు లభించింది. సిమ్స్ కాలేజీకి నాలుగు విభాగాల్లో కొత్తగా పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) నుంచి శుక్రవారం జీవో జారీ అయినట్లు ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ తెలిపారు. పీజీ సీట్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో 2022–23 విద్యాసంవత్సంతో ప్రారంభమైన 23 కొత్త మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఇందులో రామగుండం సిమ్స్‌కు మాత్రమే పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. ఈ ఏడాది నుంచే పీజీ కాలేజీ ప్రారంభానికి ఎన్‌ఎంసీ పచ్చజెండా ఊపడంపై ప్రిన్సిపాల్‌తోపాటు వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెస ర్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు యూజీ వైద్య విద్య ఉన్న సిమ్స్‌లోనే ఈఏడాది నుంచి పీజీ తరగతుల అమలుకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంపీ) వెసులుబాటు కల్పించింది.
అన్నింటికీ గ్రీన్‌సిగ్నల్..
సిమ్స్‌కు నాలుగు విభాగాల్లో నాలుగు పీజీ సీట్ల చొప్పున కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ)కి ఆరు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అన్ని సీట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
కేటాయించిన పీజీ సీట్లు ఇవే..
ఎండీ : ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు
ఎంఎస్ : ప్రసూతి, గైనకాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు
ఎంఎస్ : ఆర్థోపెడిక్స్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు
ఎండీ : బయో : కెమెస్ట్రీ విభాగంలో కూడా నాలుగు పీజీ సీట్లు కేటాయించారు.