
పార్కిన్సన్ బాధితులకు ‘డీబీఎస్’ కొత్త ఆశ
● యశోద హాస్పిటల్స్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలు
కరీంనగర్: మందులకు స్పందించని రోగులకు డీబీఎస్ చికిత్స అద్భుత ఫలితాలనిస్తోందని, హైటెక్‌సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలు తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద మెడికల్ సెంటర్‌లో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పార్కిన్సన్ వ్యాధి వేధిస్తోందన్నారు. గతంలో వృద్ధుల్లోనే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. శరీర కదలికలను నియంత్రించే మెదడులోని భాగాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతోందని, ఫలితంగా చేతులు వణకడం, నడకలో ఇబ్బందులు, శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. వ్యాధి ప్రారంభదశలో మందులతో నియంత్రించినప్పటికీ, కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స ఆధారిత ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ (డీబీఎస్) కొత్త ఆశలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఈ విధానంలో మెదడులోని నిర్దిష్ట భాగాల్లో ఎలక్ట్రోడ్లను అమర్చి, ఛాతీలో అమర్చిన చిన్న పరికరానికి అనుసంధానిస్తామన్నారు. ఈ పరికరం పంపే విద్యుత్ సంకేతాలు మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తాయిని వివరించారు. సరైన మందులు, వ్యాయామం చేసుకుంటే పార్కిన్సన్ బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని సూచించారు.