
గిట్టుబాటు కాక మూసేశారు
పట్టణంలోని రెడ్‌క్రాస్ భవనం వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ ఇది. దీని సమీపంలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారికి ఉపయోగపడే పబ్లిక్ టాయిలెట్‌ను నీటి సమస్యతో మూసేశారు.
కూబ్‌సింగ్ కుంట పార్కు వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్ ఇది. వాకింగ్, ఆహ్లదం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పార్కుకు వస్తుంటారు. కారణమేంటో కానీ కొన్ని నెలలుగా మూసివేశారు. పార్కుకు వచ్చే వారు అత్యవసరానికి ఇబ్బంది పడుతున్నారు.
మెట్‌పల్లి: జిల్లాకు సరిహద్దులో ఉన్న మెట్‌పల్లి పట్టణానికి సమీప ప్రజలతో పాటు మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, కమ్మర్‌పల్లి మండలాల నుంచి వివిధ పనుల కోసం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అత్యవసర సమయంలో ఇబ్బంది కాకుండా మున్సిపల్ అధికారులు పలుచోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని చాలాకాలంగా మూతబడ్డాయి. పట్ట ణంలోని బస్‌డిపో చౌరస్తా, కొత్త బస్టాండ్, రెడ్ క్రాస్ బిల్డింగ్, కూబ్‌సింగ్ కుంట, మున్సిపల్ కార్యాలయం, ఆరపేట చౌరస్తా, మండల పరిషత్ ఆవరణల్లో స్వచ్ఛ భారత్ నిధులతో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మండల పరిషత్‌లోనిది మినహా మిగతావాటి నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. కొంతకాలం సక్రమంగానే నడవగా.. తర్వాత గిట్టుబాటు కావడం లేదని మూసేశారు. రెడ్ క్రాస్ భవనం వద్ద ఉన్న దాన్ని నీటి సమస్య తలెత్తడంతో మూసివేశారు. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మరుగుదొడ్డిని బిల్లులు రావడం లేదని ప్రైవే ట్ వ్యక్తి మూసేశాడు. దాన్ని ఓ వ్యాపారికి వస్తువులు పెట్టుకోవడానికి అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. కాగా.. ‘పట్టణంలో మూతపడ్డ టాయిలెట్లు అన్నికూడా వినియోగంలోకి తీసుకరావడంపై దృష్టి సారిస్తాం. కొత్త బస్టాండ్ వద్ద మరుగుదొడ్డిని ప్రైవేట్ వ్యక్తి అద్దెకు ఇవ్వడంపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాం’.అని మెట్‌పల్లి మున్సిపల్ డీఈఈ నాగేశ్వర్‌రావు వివరించారు.

గిట్టుబాటు కాక మూసేశారు