
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
ధర్మపురి: భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులు, రిజిష్టర్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలన్నారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానం పునర్‌నిర్మాణ భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం ధర్మపురిలోని కస్తూరిబా గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఏమైన సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం, వంటగదులు పరిశీలించారు. ఖాళీస్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆర్డీవో మధుసుదన్, డీఈవో రాము, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సకాలంలో ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమయంత్రాలు, ప్యాడీక్లీనర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం డబ్బులు, బోనస్ 48గంటల నుంచి 72గంటల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. అదనపు కలెక్టర్ లత, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నెం హరిణి, డీఆర్డీఏ పీడీ రఘువరణ్ పాల్గొన్నారు.