
బాకీకార్డుల పేరిట బీఆర్‌ఎస్ నాటకం
● ప్రజలకిచ్చిన హామీలపై చర్చకు సిద్ధం ● బీఆర్‌ఎస్ పదేళ్లలో ఏం చేసింది..? ● రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: బాకీ కార్డుల పేరిట బీఆర్‌ఎస్ కొత్త నాటకం ఆడుతోందని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అందిన పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అనేక వాగ్దానాలిచ్చి.. పదేళ్లు పాలించి.. రాష్ట్రాని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై అనేక ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ ప్రజలకు చేసిందేమిటో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతోనే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను నడిపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి రానున్న రోజుల్లో ప్రజల మద్దతు తీసుకుంటామని అన్నారు. ధర్మపురిలో డిగ్రీ కళాశాల, బస్‌డిపో, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని, గోదావరిలో మురికినీరు కలువకుండా రూ.17కోట్లతో సీనరేజ్ ట్రిట్మెంట్ ప్లాంట్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నేరెళ్ల వద్ద రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కళాశాల నిర్మాణానికి త్వరలో ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. ఆయన వెంట నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, చిలుముల లక్ష్మణ్, మొగిలి తిరుపతి, మధుకర్‌రెడ్డి, చీపిరిశెట్టి రాజేష్ తదితరులున్నారు.