
బీసీలను మభ్యపెట్టారు
● చట్టబద్దత లేకుండా 42శాతం ఎలా..? ● కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ..? ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
జగిత్యాల/మెట్‌పల్లి: బీసీలను మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో చట్టబద్దత లేకుండా రాష్ట్రప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఈనెల 18న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని, బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బలహీనవర్గాల కోసం మాజీ సీఎం కేసీఆర్ న్యాయం చేశారని, మోదీ, రాహూల్‌గాంధీ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించేలా చూడాలన్నారు. బీసీలు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్, బీజేపీ కనుమరుగవుతాయన్నారు. ఈనెల 18న బంద్‌కు వ్యాపార, వాణిజ్యవర్గాలు సహకరించాలని కోరారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అంటేనే బీసీల పార్టీ అని, కేసీఆర్ ఉద్యమకాలం నుంచి బీసీల కోసం ఎంతో పోరాటం చేశారన్నారు. నాయకులు గట్టు సతీశ్, మల్లేశం, ఆనందరావు, అనురాధ, శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకుముందు విద్యాసాగర్‌రావు మెట్‌పల్లిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.