
ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయండి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 6,66,500 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. 92 బాయిల్డ్‌రైస్ మిల్లులు తప్పనిసరిగా వందశాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలన్నారు. వచ్చిన ధాన్యం వచ్చినట్లే దిగుమతి చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ లత, పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి, మేనేజర్ జితేంద్రప్రసాద్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
పెండింగ్ ఓటరు దరఖాస్తులు పరిష్కరించాలి
పెండింగ్ ఓటరు దరఖాస్తులు పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ బూత్‌కు అధికారిని నియమించాలని, బీఎల్వోలకు ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేర్లు లేనివారిని గుర్తించి నివేదిక తయారు చేస్తున్నామన్నారు.