
పనులు చేస్తారా.. తప్పుకుంటారా..
కాంట్రాక్టర్లకు ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖల ఉత్తర్వులు
పాత పనుల్లో టెండర్ల పరేషాన్
బిల్లు రానిదే చేయలేమంటున్న కాంట్రాక్టర్లు
కోరుట్ల: జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఆర్‌అండ్‌బీ, పీఆర్ విభాగాలకు చెందిన పనులు చేసేందుకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పనులు సత్వరమే ప్రారంభించాలని, లేకుంటే రద్దు చేసుకోవాలని గత నెల 15, 19వ తేదిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో బిల్లులు రాకపోవడంతో మిగిలిన పనులు మొదలుపెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇదివరకు చేసిన పనులకు బిల్లులు మంజూరైతే మిగిలిన పనులు చేద్దామన్న ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నారు. తాజాగా సదరు పనులను రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో మల్లగుల్లాలు పడుతున్నారు.
పాత బిల్లుల పరేషాన్..
జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల బిల్లులు చాలామేర ఇప్పటికీ కాంట్రాక్టర్ల చేతికి అందలేదు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సోషల్ వెల్ఫేర్‌లో పూర్తయిన పనులకు సంబంధించి సుమారు రూ.60 కోట్ల మేర బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంది. రెండేళ్లు గడుస్తున్నా ఆ బిల్లులు ఇప్పటికీ మంజూరు కాలేదు. పాత బిల్లుల కోసం ఇటు అధికార యంత్రాంగం..అటు అధికార పార్టీ నాయకుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. ఈ బిల్లుల రాకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్ వేసి పనులు మొదలుపెట్టని వాటిని ఈఈ, డీఈ స్థాయి అధికారులు పరిశీలించి వాటిని రద్దు చేసుకోవాలని కాంట్రాక్టర్లతో లేఖలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
రద్దు వైపు మొగ్గు..?
రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో పాత ప్రభుత్వ హయాంలో టెండర్లు దక్కించుకుని పనులు మొదలు పెట్టని కాంట్రాక్టర్లు ఆ పనులను రద్దు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్టు తీసుకుని గ్రౌండింగ్ పనులు కాకపోవడం.. అసలే పనులు మొదలు కాకుండా ఉన్న పనులను గుర్తించడానికి అధికారులు సన్నాహలు చేపట్టారు. ఆ పనులకు ఈఎండీ డబ్బులను వాపస్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల వచ్చిన క్రమంలో కాంట్రాక్టర్ల పనుల రద్దు లేఖలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధర్మపురిలో మినహా మిగిలిన చోట్ల కాంట్రాక్టర్లు పాత టెండర్ల నుంచి తప్పుకోవడం వైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం. ఒకవేళ కాంట్రాక్టర్లు తప్పుకుంటే తిరిగి నిధులు రావడం.. టెండర్లు వేయడం వంటి ప్రక్రియ పూర్తికావడానికి తీవ్ర జాప్యం జరుగుతుంది. అదే జరిగితే సీసీ రోడ్లు, వంతెనలు, కాజ్‌వేల పనులు పూర్తి కాక జనం నానా తిప్పలు పడే అవకాశాలు ఉన్నాయి.