
మక్కల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సిద్ధం
జగిత్యాలఅగ్రికల్చర్: మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. మొన్నటి వరకు క్వింటాల్‌కు రూ.3వేలు పలికిన ధర.. ప్రస్తుతం రూ.1800కు పడిపోయింది. ఈ క్రమంలో మద్దతు ధర రూ.2400 చొప్పున కొనాలని రైతులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు కొనేందుకు సర్కారు నిర్ణయించింది. ఆదేశాలు రాగానే కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది.
జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటు
మొక్కజొన్న పంట అధికంగా సాగయ్యే ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మెట్‌పల్లి, రాయికల్, బీర్‌పూర్, భీమారం, మేడిపల్లి మండల కేంద్రాల్లో 13 కేంద్రాలను ఏర్పాటు చేయన్నారు.
9.61లక్షల క్వింటాళ్లు అంచనా
జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్నే అధికంగా సాగు చేస్తారు. సుమారు 32,061ఎకరాల్లో సాగు చేయగా.. ఎకరాకు 30క్వింటాళ్ల చొప్పున 9.61 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు చేసిన మక్కలను మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లిలోని గోదాముల్లో నిల్వ చేయనున్నారు. సుమారు నాలుగు లక్షల గన్నీ సంచులు తెప్పిస్తున్నారు. అందుబాటులో ఉండాలని హమాలీలకు సూచించారు.